ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) న్యూజిలాండ్ కచ్చితమైన ప్రణాళికతో పాటు కలిసికట్టుగా బరిలోకి దిగుతుందని చెప్పాడు టీమ్‌ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin). అంతకంటే ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం కూడా ఆ జట్టుకు కలిసివస్తుందని అన్నాడు. ఈ విషయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా భారత్ జట్టు మారి అలవాటు పడాలని, అదే మనకు కీలకమని చెప్పాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడిన సందర్భంగా ఛాంపియన్‌షిప్‌పై అతడు ఈ అభిప్రాయాల్ని వ్యక్తంచేశాడు.
అనంతరం ఇషాంత్ శర్మ(Ishanth Sharma) మాట్లాడుతూ.. ఈ టెస్టు ఛాంపియన్‌షిప్ కష్టతరమైన ప్రయాణమని, అలాగే భావోద్వేగమైంది కూడా అని చెప్పుకొచ్చాడు. ఇది ఐసీసీ టోర్నమెంట్ అయినందున 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్‌తో సమానమన్నాడు.
2019లో వెస్టిండీస్‌తో ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమైనప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli) మాట్లాడుతూ.. ఇది కేవలం నెల రోజుల కష్టం కాదని, రెండేళ్లు సాగే సుదీర్ఘ ప్రయాణమని పేర్కొన్నట్లు గుర్తుచేశాడు. అలాగే కొవిడ్-19తో ఈ టోర్నీలో నియమాలు మారినప్పుడు భారత్ కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. క్లిష్టపరిస్థితుల్లోనే ఆస్ట్రేలియాపై విజయం సాధించామని, ఆపై ఇంగ్లాండ్‌తోనూ గెలుపొందామని ఇషాంత్ వివరించాడు.
ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన షమి(Mohammed Shami).. తమ రెండేళ్ల కష్టానికి అదే అసలైన పరీక్ష అని, అక్కడ విజయం సాధించడం కీలకంగా మారిందని పేర్కొన్నాడు. అందుకోసం తాము 110 శాతం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సీనియర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కంగారూలపై సిరీస్ గెలవడం తనకు అమితానందం కలిగించిందని చెప్పాడు. ఆటగాళ్లు నేర్చుకునేందుకు ఆ టోర్నీ ఒక ఉదాహరణ అని, ఆ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని షమి అన్నాడు.
ఇదీ చూడండి:'సోషల్ మీడియాతో భవిష్యత్ అలా ఉంటుంది'