World Athletics Championships Host Country 2029 : 2029 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఆతిథ్యానికి భారత్ బిడ్ వేయనుంది. ఈ మేరకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా- ఏఎఫ్ఐ సీనియార్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్ తెలిపారు. ''2029 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆతిథ్యానికి బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. 2036 ఒలింపిక్స్, 2030 యూత్ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ ఇప్పటికే ఆసక్తి చూపించింది. 2029 ప్రపంచ అథ్లెటిక్స్ నిర్వహణ అవకాశం లభిస్తే ఇంకా బాగుంటుంది'' అని ఆమె వివరించారు. అయితే ఇంతకుముందు 2027 ప్రపంచ టోర్నీ ఆతిథ్యం పట్ల ఆసక్తి కనబరిచిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2029 పోటీలపై దృష్టిసారించనుంది.
శిక్షణ శిబిరాలకు తెర..
2024 పారిస్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత అగ్రశ్రేణి క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరాలకు తెరదించాలని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు తెలియజేశామని, దీనిని వాళ్లు అభినందించారని తెలిపింది. 'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- సాయ్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, టాటాతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల దగ్గర మంచి మౌలిక వసతులున్నాయని, ఆ సంస్థలు భారీగా పెట్టుబడి పెట్టాయి. ఫారిన్ కోచ్‌లను నియమించాయి. వాళ్లు అక్కడే క్రీడాకారులకు ట్రైనింగ్ ఇప్పించొచ్చు. కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అథ్లెట్లకు నేరుగా శిక్షణ ఇవ్వొచ్చు' అని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా వివరించారు.