తెలంగాణ

telangana

ETV Bharat / sports

Womens IPL: బీసీసీఐ ఖాతాలోకి మరో రూ. 4వేల కోట్లు!

ఈ నెల 25న జరగబోయే మహిళల ఐపీఎల్ జట్లు వేలం పాటు ప్రక్రియ జరగనుంది. ఈ వేలం పాట ద్వారా దాదాపు మరో రూ.4 వేల కోట్లు బీసీసీఐ ఖాతాలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.

WIPL Team Bid BCCI set for another 4000 cr windfall
Womens IPL: బీసీసీఐ ఖాతాలోకి మరో రూ. 4వేల కోట్లు!

By

Published : Jan 23, 2023, 4:45 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో(ఐపీఎల్) బీసీసీఐ రాతే మారిపోయింది. గత 15 ఏళ్లుగా క్రికెట్​ అభిమానులను ఊర్రూతలూగిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ ధనాధన్ లీగ్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా క్యూ కడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ మెగా లీగ్​ కారణంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెటే ఆగిపోతుందంటేనే ఈ లీగ్​ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లను ప్రవేశపెట్టి వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్న బీసీసీఐ.. ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్​ను (డబ్ల్యూఐపీఎల్‌) నిర్వహించి తమ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోబోతుంది.

ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఈ మహిళల ఐపీఎల్‌ కోసం ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఐదు జట్లతో ఈ లీగ్‌ను ప్రారంభించనుంది. ఈ మహిళల జట్లను కొనుగోలు చేసేందుకు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే దీనికి సంబంధించి ఐదు టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. దాదాపు 30కు పైగా అగ్ర శ్రేణి కంపెనీలు టెండర్ల దరఖాస్తులను కొనుగోలు చేశాయి. ఇందులో మెన్స్ ఐపీఎల్‌ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉన్నాయి. 25వ తేదీన వేలంలో పాల్గొననున్నాయి.

అయితే తాజాగా మార్కెక్​ ఎక్స్​పర్ట్​ నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక్కో జట్టును దాదాపు రూ.600 కోట్లకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందని తెలిపారు. ఒకేవేళ ఈ రేంజ్​లో ఒక్కో జట్టు ధర పలికితే.. మొత్తంగా మరో నాలుగు వేల కోట్ల వరకు బీసీసీఐ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. "మహిళల ఐపీఎల్​ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బిడ్స్​ ద్వారా ఒక్కో జట్టు రూ.500 నుంచి రూ.800కోట్ల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది" అని ఇంతకుముందు పురుషులు ఐపీఎల్​ బిడ్ల టీమ్​లో పని చేసిన ఓ అధికారి తెలిపారు.

కాగా, ఐపీఎల్‌ ప్రసార (మీడియా) హక్కుల్ని వయాకామ్‌ 18 సొంతం చేసుకుంది. అయిదేళ్ల కాలానికి గాను రూ.951 కోట్లకు ప్రసార హక్కులు వయాకామ్‌ 18 వశమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్‌కు వయాకామ్‌.. రూ.7.09 కోట్లు చెల్లించనున్నట్లు బోర్డు పేర్కొంది.

ఛాంపియన్ జట్టుకు ఎంతంటే?.. సమాచారం ప్రకారం ఛాంపియన్​ జట్టుకు బీసీసీఐ ఆదా రూ. 28.08 కోట్లు దక్కుతుందని తెలిసింది. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.27.20 కోట్లు, ఆ తర్వాత స్థానాల్లో రూ.26.33 కోట్లు, రూ.25.45 కోట్లు, రూ.24.57 కోట్లు లభిస్తాయి. అయితే ఇది 2027 వరకు ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది.

అప్పుడే ప్రారంభం.. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. 5 జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. జనవరి 25న అన్ని జట్ల పేర్లను వెల్లడించిన తర్వాత, ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ఉంటుంది. వేలంలో ఒక్కో జట్టు రూ.12 కోట్ల పర్స్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే.. వాంఖడే, డీవై పాటిల్‌ వంటి పెద్ద మైదానాలు ఉన్న కారణంగా లీగ్‌ మొత్తాన్ని ముంబయి వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక వెల్లడించాల్సి ఉంది.

ఇదీ చూడండి:ఫుట్​బాల్​ చరిత్రలోనే తొలిసారి అలా.. ఫ్యాన్స్​ షాక్​!

ABOUT THE AUTHOR

...view details