Deepak Chahar Contract Amount: ఐపీఎల్ 2022 ఆటగాళ్ల మెగా వేలంలో దీపక్ చాహర్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లుకు కొనుగోలు చేసింది. ఇక అదే నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దీపక్ గాయపడ్డాడు. అప్పుడు నుంచి అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స పొందుతున్నాడు. గాయాలతో బాధపడుతున్న అతడు ఈ సీజన్‌లోని ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఏప్రిల్ రెండో వారంలో లీగ్‌లోకి ప్రవేశిస్తాడనుకున్న చాహర్.. వెన్నుముక గాయంతో ఇప్పుడు సీజన్ మొత్తానికి దూరమవుతున్నాడని సీఎస్కే జట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చాహర్ గురించి క్రికెట్ అభిమానుల్లో ఓ చర్చ మొదలైంది. అతడు ఈ లీగ్‌కు సంబంధించిన రూ.14 కోట్ల మొత్తాన్ని పొందుతాడా? లేదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
BCCI Contract Players: బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడు దీపక్ చాహర్. అతడు జాతీయ క్రికెట్ బోర్డు 2022 సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాలో గ్రేడ్ సీ కేటగిరీలో ఉన్నాడు. అంటే గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినప్పటికీ.. ఈ సీజన్ సంబంధించిన జీతం మొత్తాన్ని అతడు పొందనున్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ బీమా పాలసీ ఉంటుంది. గాయాల కారణంగా ప్లేయర్లు ఐపీఎల్ సీజన్‌కు దూరమైతే.. బీసీసీఐ బీమా పాలసీ ద్వారా ఆటగాళ్లకు డబ్బులను చెల్లిస్తుంది. ఈ నిబంధన ఐపీఎల్ సీజన్ 2011 నుంచి అమల్లోకి వచ్చింది.