తెలంగాణ

telangana

ETV Bharat / sports

WI Vs SA : ప్రపంచంలోనే తొలి జట్టుగా సౌతాఫ్రికా సరికొత్త రికార్డు.. 39 బంతుల్లోనే! - వెస్టండీస్​ సౌతాఫ్రికా టీ20 సిరీస్​

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక లక్ష్యం ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ప్రొటీస్​.. ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు, ఇదే మ్యాచ్​లో వెస్టండీస్​ బ్యాటర్​ ఛార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.

WI VS SA second t20 south africa west indies new records
WI VS SA second t20 south africa west indies new records

By

Published : Mar 27, 2023, 8:43 AM IST

Updated : Mar 27, 2023, 8:52 AM IST

అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్‌ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. సెంచూరియన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆ జట్టు​.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 245 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేజ్‌ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్‌ కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రొటీస్‌ ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది.

259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్‌ బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఆడిన డికాక్‌ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ రెజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరిలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు విజయాన్ని అందించాడు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. విండీస్‌ ‍బ్యాటర్లలో జాన్సన్ ఛార్లెస్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఆడిన ఛార్లెస్ 118 పరుగులు చేశాడు. ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ (41) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రొటీస్‌ బౌలరల్లో జానెసన్‌ మూడు వికెట్లు, పార్నెల్‌ రెండు వికెట్లు సాధించారు.

వెస్టిండీస్‌ ప్రపంచ రికార్డు..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్స్‌లు బాదేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన అఫ్గానిస్థాన్​ రికార్డును వెస్టిండీస్‌ సమం చేసింది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్​ కూడా 22 సిక్స్‌లు సాధించింది. ఆ తర్వాత స్ధానంలో కూడా విండీస్‌నే ఉంది. 2016లో భారత్‌తో జరిగిన టీ20లో విండీస్‌ 21 సిక్స్‌లు కొట్టింది.

వెస్డిండీస్​ క్రికెటర్​ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో వెస్డిండీస్​ క్రికెటర్ ఛార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో కింగ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఛార్లెస్‌.. మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఆడిన ఛార్లెస్​.. 118 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన ఛార్లెస్‌ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన విండీస్‌ క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఛార్లెస్‌ ఘనత సాధించాడు.

Last Updated : Mar 27, 2023, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details