తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​'.. బ్యాట్స్​మెన్​కే ఎక్కువగా ఎందుకు?

ప్రస్తుత క్రికెట్​లో బ్యాట్స్​మెన్​ ఎక్కువగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకుంటున్నారు. మరోవైపు బౌలర్లు అద్భుతంగా అడుతున్నప్పటికీ వాళ్లకు మాత్రం తగిన గుర్తింపు రావట్లేదు. ఈ పరిస్థితుల గురించి విశ్లేషాణాత్మక కథనం.

Why the player of the match award is vastly biased towards batsmen?
క్రికెట్ న్యూస్

By

Published : May 20, 2021, 9:01 AM IST

వావ్! విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. రోహిత్ శర్మ చితక్కొట్టాడు. మ్యాక్స్​వెల్ రెచ్చిపోయాడు. డివిలియర్స్ సిక్సుల మోత మోగించాడు. కామెంటేటర్స్​తో సహా క్రికెట్​ ప్రేమికులు, అభిమానుల నుంచి మనకు తరచూ వినిపించే మాటల్లో ఇవి కొన్ని. అవును ఇటీవల జరిగిన ఐపీఎల్​​లో బ్యాటింగ్​ మరో స్థాయిలో ఉంది. కానీ బౌలర్ల పరిస్థితేంటి?

పైన బ్యాట్స్​మెన్​ గురించి చెప్పినట్లు మీరు బౌలర్లు గురించి గొప్పగా ఏమైనా విన్నారా? దాదాపుగా విని ఉండరు! ఎందుకంటే అది మీ తప్పు కాదు. క్రికెట్​ అనేది చాలా ఏళ్ల క్రితమే బ్యాట్స్​మెన్ గేమ్​గా మారిపోయింది. బౌలర్లు ఎంతలా కృషి చేసినప్పటికీ వాళ్లకు తగినంత గుర్తింపు రావడం లేదు. ఎవరూ ఎన్ని చెప్పినా ఇది కాదనలేని నిజం.

ఈ సీజన్​లో బ్యాటింగ్​కు కష్టంగా మారిన చెన్నై, అహ్మదాబాద్​ పిచ్​లపై పలువురు బ్యాట్స్​మెన్​ అద్భుతంగా ఆడారు. అదే ఫ్లాట్​ పిచ్​లపై బౌలర్లు మెప్పించే ప్రదర్శన చేస్తే ఎవరైనా గుర్తిస్తారా అంటే లేదు. స్పిన్​ పిచ్​లపై బ్యాట్స్​మెన్​ ఆడితే 'ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్'​ ఇస్తారు కానీ ఫ్లాట్​ పిచ్​లపై బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తే, వాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చేందుకు ఎందుకు సంకోచిస్తారు?

ఆవేశ్ ఖాన్

అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్​ల్లో పరిస్థితేంటి?

వాంఖడే(ముంబయి), చిదంబరం(బెంగళూరు) స్టేడియాల్లో ఈ సీజన్​లోని పలు మ్యాచ్​ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అందులో బాగా ఆడిన బ్యాట్స్​మెన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​' ఇచ్చారు. వారు దానికి అర్హులే కావొచ్చు. కానీ అదే పిచ్​లపై పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్లకూ ఆ అవార్డు ఇవ్వకూడదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. 222 పరుగల లక్ష్య ఛేదనలో 119 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసినప్పటికీ, తమ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు చెందిన కెప్టెన్ శాంసన్​కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు ఇచ్చారు. కానీ 11 రన్​రేట్​తో మొత్తంగా 438 పరుగులు నమోదైన​ ఈ పోరులో పంజాబ్ బౌలర్ అర్షదీప్ (3/35) మెరుగైన గణాంకాలతో బౌలింగ్ చేశాడు. కానీ అతడిని ఎవరూ గుర్తించలేదు.

చెన్నై - దిల్లీ మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్​లో ధావన్ ఆకట్టుకున్నాడు. 54 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​'గా నిలిచాడు. అయితే బ్యాటింగ్​కు అనుకూలించే వాంఖడే లాంటి ఫ్లాట్ పిచ్​పై పరుగులు చేయడం ఏమైనా కష్టమా?

ఇదే మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన బౌలర్ ఆవేశ్ ఖాన్​(దిల్లీ) గురించి చాలా తక్కవమంది మాత్రమే మాట్లాడలేదు. కొత్త బంతితో, డెత్​ ఓవర్లలో బౌలింగ్ చేసి, నాలుగు ఓవర్లలో 23 పరుగులే ఇచ్చాడు. డుప్లెసిస్, ధోనీ లాంటి కీలక వికెట్లు తీశాడు. ఇక్కడ అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అందుకునే అర్హత లేదా?.. సమాధానం మీకే వదిలేస్తున్నాను.

బ్యాటింగ్​కు కష్టమైన పిచ్​లపై పరిస్థితేంటి?

ఈ సీజన్​లో చెన్నైలో జరిగిన 10 మ్యాచ్​ల్లో ఐదింటిలో బ్యాట్స్​మెన్​ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​'లుగా నిలిచారు. ఇదే పిచ్​పై హైదరాబాద్-ముంబయి మధ్య జరిగిన పోరులో పొలార్డ్, 22 బంతుల్లో 35 పరుగులు చేసి, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'​ అందుకున్నాడు. అదే మ్యాచ్​లో 3/19 గణాంకాలతో ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేసిన రాహుల్ చాహర్​.. ఆ అవార్డుకు అర్హుడు కాదా?

రవి బిష్ణోయ్

కష్టతరమైన పిచ్​లపై బాగా ఆడిన బ్యాట్స్​మెన్​కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చినప్పుడు ఉన్న లాజిక్.. ఫ్లాట్​ పిచ్​లపై బాగా బౌలింగ్ చేసిన బౌలర్లు ఎందుకు వర్తించదో? క్రికెట్ అనేది ఇప్పటికే బ్యాట్స్​మెన్ గేమ్​ అయిపోయింది. ఇలానే జరిగితే భవిష్యత్తులో బౌలర్లకు బదులు బౌలింగ్ మెషీన్స్ పెట్టుకునే గత్యంతరం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!

ABOUT THE AUTHOR

...view details