తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా తొలి వన్డేలో 9 రన్స్‌ మాత్రమే చేశా.. అప్పుడు ధోనీ చెప్పిన మాటలు ధైర్యాన్నిచ్చాయి' - శుభమన్​గిల్​ టీమ్​ఇండియా

టీమ్​ఇండియాలో నిలకడగా రాణిస్తున్న యువ క్రికెటర్లలో శుభమన్​ గిల్​ ఒకడు. మూడేళ్ల కింద వన్డేల్లోకి.. 2020లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన గిల్​ ఇంకా టీ20ల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయాడు. తాజాగా కివీస్​తో సిరీస్​లోనైనా అరంగేట్రం చేస్తాడని భావించినా రెండో టీ20లో తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఈ క్రమంలో గిల్ తన వన్డే అరంగేట్రం గురించి గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

/when-ms-dhoni-consoled-shubman-gill-about-his-debut-odi-match
/when-ms-dhoni-consoled-shubman-gill-about-his-debut-odi-match

By

Published : Nov 21, 2022, 8:40 AM IST

మూడేళ్ల కిందట న్యూజిలాండ్‌పైనే శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. వన్డే అరంగేట్రం చేసిన గిల్‌ నిలకడగా రాణిస్తూ తుది జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా భారత్‌ మూడు టీ20ల కోసం న్యూజిలాండ్‌ పర్యటనలోనే ఉంది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌తోనైనా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లోకి అడుగు పెడదామని గిల్‌ భావించాడు. కానీ అతడికి చోటు లభించలేదు. ఇక మంగళవారం చివరి మ్యాచ్‌ జరగనుంది. అందులోనైనా అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో శుభ్‌మన్‌గిల్ తన వన్డే అరంగేట్రం గురించి గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

న్యూజిలాండ్‌తో 2019లో వన్డే సిరీస్‌ సందర్భంగా అక్కడికి వెళ్లిన భారత్‌కు ఘోర ఓటమి ఎదురైంది. గిల్‌ ఆడిన మొదటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 92 పరుగులకే కుప్పకూలింది. అందులో గిల్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన తనను అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓదారుస్తూ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని గిల్ పేర్కొన్నాడు. "ఆ రోజు చాలా నిరుత్సాహానికి గురయ్యా. నా వయస్సు 19 ఏళ్లు మాత్రమే. అరంగేట్ర మ్యాచే ఇలా అయిందని బాధపడుతున్నా. అప్పుడు కెప్టెన్ ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చాడు. 'బాధపడకు. నా కంటే నీ అరంగేట్రమే నయం' అని అన్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో ధోనీ కేవలం ఒక్క బంతినే ఎదుర్కొని రనౌట్‌ రూపంలో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఎంతో సరదాగా మాట్లాడాడు. దీంతో నా మూడ్‌ కొంచెం మారింది. గొప్ప స్థాయిలో ఉన్న ఆటగాడు ఇలా అండగా నిలుస్తాడని ఎవరూ ఆశించరు. అది నాకెంతో నచ్చింది. నేను కూడా అతడిలా ఉండాలని అనుకున్నా" అని గిల్ గుర్తు చేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details