తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: సీఎస్కేకు ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉందా?

CSK Chances to win IPL 2022: బరిలోకి దిగితే విజయమే అన్నట్లుగా కనిపించే చెన్నై జట్టు... ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. 2020 సీజన్‌లో ఇలాగే తడబడి ప్లేఆఫ్స్‌ కూడా చేరకుండా ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. ఒక్కటే గెలిచింది. ఈ వారంతో సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతున్న నేపథ్యంలో... చెన్నై టీమ్‌ పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం!

CSK
CSK

By

Published : Apr 20, 2022, 6:53 AM IST

CSK Chances to win IPL 2022: 2020 ఘోర ఓటమి తర్వాత గతేడాది పడిలేచిన కెరటంలా బలంగా తిరిగొచ్చి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇప్పుడు జడేజా నేతృత్వంలో ఐదోసారి కప్పు సాధించి ముంబయితో సమానంగా నిలవాలని చూస్తుంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది చెన్నై ప్లేఆఫ్స్‌ చేరుతుందా లేదా అనే అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

2010లోనూ ఇలాగే.. కానీ..!..చెన్నై 2010లోనూ ఇలాగే ఆరంభంలో తడబడింది. తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలైనా చివరికి విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు.. లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేసరికి 14 పాయింట్లతో నిలిచింది. ఫైనల్‌కు చేరి తొలిసారి టైటిల్‌ ముద్దాడింది. అక్కడి నుంచి మొదలైన కప్పుల వేట ఇంకా కొనసాగుతోంది. మరి ఇప్పుడు అలాంటి ఫలితమే పునారవృతం చేస్తుందా.. లేదా చూడాలి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చెన్నై కనీసం ప్లేఆఫ్స్‌ అయినా చేరుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వరుసగా నాలుగు ఓటముల అనంతరం ఐదో మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం సాధించడంతో ఆశలు చిగురించిన వేళ.. మళ్లీ ఆరో మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచీ ఆధిపత్యం చెలాయించినా చివరి క్షణాల్లో పట్టువదిలి మ్యాచ్‌ చేజార్చుకుంది. దీంతో ఇదే ఇప్పుడు ఆ జట్టును కంగారు పెట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ఇకపై నెగ్గుకు రావాలంటే మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంది.

ప్లేఆఫ్స్ చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలి?..ఎప్పటిలాగే ఈసారి కూడా ఏ జట్టు అయినా ప్లేఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా 14 పాయింట్లు సాధించాలి. ఇతర జట్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో.. 14 పాయింట్లే సాధిస్తానంటే సరిపోదు. ముందే బెర్తు ఖాయం కావాలంటే 16 పాయింట్లు సాధించాలి. అప్పుడు నెట్‌రన్‌ రేట్‌తో సంబంధం లేకుండా టాప్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, చెన్నై ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలవడంతో కేవలం 2 పాయింట్లతోనే ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. అలాంటప్పుడు మిగతా జట్లను దాటి ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకో 14 పాయింట్లు కావాల్సి ఉంది. అంటే ఇకపై ఆడాల్సిన 8 మ్యాచ్‌ల్లో 7 గేమ్‌లు తప్పక గెలవాలి. ఒకవేళ ఆరు గెలిస్తే ఆఖర్లో రన్‌రేట్‌ విషయంలో ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. కానీ, చెన్నై ప్రస్తుత రన్‌రేట్‌ (-0.638) పరిస్థితి మైనస్‌లో ఉండటంతో అభిమానులకు కాస్త ఆందోళనగానే ఉంది.

చెన్నై బలాబలాలు.. ఇతర జట్లు ఎలా ఉన్నాయి.?..చెన్నై జట్టు ప్రస్తుతం శివమ్‌ దూబే, రాబిన్‌ ఉతప్పలపైనే అధికంగా ఆధారపడుతోంది. నాలుగేళ్లుగా ఈ టీ20 లీగ్‌లో ఆడుతున్నా ఎప్పుడూ పెద్దగా ఆకట్టుకోని దూబే ఈసారి విశేషంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అతడే కీలక ఆటగాడిగా మారాడు. మరోవైపు ఓపెనర్‌గా రాబిన్‌ ఉతప్ప రాణిస్తున్నా.. గతేడాది టాప్ స్కోరర్‌, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇబ్బందులు పడుతున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతడు రాణించడం ఊరటనిచ్చే విషయం. తర్వాత అంబటి రాయుడు అంతంత మాత్రంగానే ఉన్నాడు. కెప్టెన్‌ జడేజా ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు ధోనీ తొలి మ్యాచ్‌లో మెరిసినా తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. బౌలింగ్‌లో బ్రావో, మహీష్‌ తీక్షణలు ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై 8 మ్యాచ్‌ల్లో 7 గెలవాలంటే మామూలు విషయం కాదు. కానీ, ప్రయత్నిస్తే కచ్చితంగా ముందుకు సాగే వీలుంది. దీంతో రాబోయే రోజుల్లో ఏయే జట్లతో ఎలా ఆడాల్సి ఉందో పరిశీలిద్దాం.

ముంబయి: చెన్నై తర్వాత ఆడాల్సిన టీమ్‌ ముంబయి. ఏప్రిల్ 21న ఒకటి‌, మే 12న ఇంకో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి దీనికన్నా ఘోరంగా ఉంది. రోహిత్‌ సేన ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటీ విజయం సాధించలేదు. దీంతో ఈ సీజన్‌లో ఇంకా విజయాల ఖాతా తెరవని జట్టుగా చిట్టచివరిస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టులో సూర్యకుమార్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ ఫర్వాలేదనిపిస్తున్నా పెద్దగా రాణించలేకపోతున్నారు. మరోవైపు సీనియర్లు రోహిత్‌, పొలార్డ్‌, బుమ్రా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో చెన్నై కాస్త కష్టపడితే ముంబయిపై రెండు విజయాలూ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

పంజాబ్‌: ముంబయి తర్వాత చెన్నై ఆడాల్సింది పంజాబ్‌తో. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 ఓటములతో పడిలేస్తూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 25న ఆ జట్టుతో ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. ఇప్పటికే ఆడిన తొలి మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ టీమ్‌ 54 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ఆ జట్టులో బిగ్‌ హిట్టర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. కెప్టెన్ మయాంక్‌ అంతంత మాత్రంగా ఆడుతున్నా తనదైన రోజు ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తాడు. ఇక బౌలింగ్‌లో రాహుల్‌ చాహర్‌, కగీసో రబాడా ఆకట్టుకుంటున్నారు. దీంతో పంజాబ్‌తో జరిగే పోరులో చెన్నై గెలవాలంటే బ్యాటింగ్‌లో లివింగ్‌స్టోన్‌, ధావన్‌ను కట్టడి చేయాలి. అలా చేస్తే సగం మ్యాచ్‌ గెలిచేసినట్లే.

హైదరాబాద్‌: ఈ సీజన్‌ ఆరంభంలో చెన్నైలాగే హైదరాబాద్‌ కూడా తడబడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై కాస్త కంగారు పెట్టించింది. కానీ, తర్వాత అనూహ్యంగా పుంజుకున్న విలియమ్సన్‌ టీమ్‌ ఆపై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అందరికీ షాకిచ్చింది. అయితే, మే 1న చెన్నై.. హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌ జట్టులో రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ అద్భుతంగా ఆడుతున్నారు. ఓపెనర్లు విఫలమౌతున్నా ప్రత్యర్థుల నుంచి వాళ్లిద్దరూ మ్యాచ్‌ను లాగేస్తున్నారు. విలియమ్సన్‌ కూడా బాగానే ఆడుతున్నాడు. బౌలింగ్‌లో నటరాజన్‌, భువనేశ్వర్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌పై గెలవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడాల్సి ఉంది.

బెంగళూరు:ఇక తర్వాతి మ్యాచ్‌ బెంగళూరుతో. ఈ సీజన్‌లో ఆ జట్టు బాగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో దూసుకుపోతోంది. అయితే, ఇంతకుముందు చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోర్‌ చేయగా బెంగళూరు కూడా ఛేదించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, చివరికి విఫలమైంది. బెంగళూరు జట్టులో దినేశ్‌ కార్తీక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఫినిషర్‌గా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్, షాబాజ్‌ అహ్మద్‌, అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ అంతంత మాత్రంగా ఆడుతున్నా.. కేవలం డీకే వల్లే మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. బౌలింగ్‌లో వానిండు హసరంగా ఒక్కడే చెప్పుకోదగ్గ రీతిలో వికెట్లు తీస్తున్నాడు. గతేడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్‌ పటేల్‌ నామ మాత్రంగా కనిపిస్తున్నాడు. ఇక మే 4న ఈ సీజన్‌లో చెన్నై రెండోసారి బెంగళూరుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో డీకేను మరోసారి కట్టడి చేస్తే చెన్నైకి ఈ విజయం కష్టమేం కాదు.

దిల్లీ: దిల్లీ ప్రస్తుతం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 3 ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. ఆ జట్టు బాగా ఆడుతున్నా కీలక సమయంలో తడబడుతోంది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ జట్టులోకి వచ్చాక ఆ జట్టు మంచి స్కోర్లు నమోదు చేస్తోంది. మరో ఓపెనర్‌ పృథ్వీ షా సైతం బాగా ఆడుతున్నాడు. వీరిద్దరూ బలమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు అందిస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ధాటిగా ఆడుతున్నా జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్‌లో కుల్‌దీప్‌ విశేషంగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు. అలాగే ఖలీల్‌ అహ్మద్‌ కూడా బాగానే వేస్తున్నాడు. అయితే, మే 8న చెన్నై.. ఈ సీజన్‌లో తొలిసారి దిల్లీతో తలపడనుంది. ఆరోజు చెన్నై గెలవాలంటే కుల్‌దీప్‌, ఖలీల్‌ బౌలింగ్‌ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. అలాగే ఆ జట్టు ఓపెనర్లను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది.

గుజరాత్‌: ఈ సీజన్‌లో కొత్తగా వచ్చిన జట్టు గుజరాత్‌. హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌. అతడు తొలిసారి నాయకత్వం వహిస్తున్నా.. ఎవరూ ఊహించని విధంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో తీసుకెళ్తున్నాడు. కెప్టెన్‌గా అతడు ముందుండి రాణిస్తూ ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలాగే శుభ్‌మన్‌ గిల్‌, డేవిడ్‌ మిల్లర్‌ సైతం రాణిస్తుండటంతో ఆ జట్టు బ్యాటింగ్‌ యూనిట్‌ బలంగా ఉంది. ఇక బౌలింగ్‌లో మహ్మద్‌ షమి, లాకీ ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నారు. కాగా, ఇటీవల చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో రషీద్‌ సంచలన బ్యాటింగ్‌ చేయడంతో ఆ బలం మరింత పెరిగింది. దీంతో మే 15న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై గెలవాలంటే అన్ని విభాగాల్లో విశేషంగా రాణించాలి.

రాజస్థాన్‌: రాజస్థాన్‌ టీమ్‌ సైతం ఈసారి బాగా ఆడుతోంది. అందుకు ప్రధాన కారణం ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌. అతడు సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోర్లు సాధించి ఇతరులను ఓడిస్తోంది. మిడిల్‌ ఆర్డర్‌లో హెట్‌మెయిర్‌ కూడా దంచికొడుతున్నాడు. కెప్టెన్‌ సంజూ గొప్పగా ఆడకున్నా వీలైనంతమేర పరుగులు సాధిస్తున్నాడు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌, ట్రెంట్‌ బౌల్ట్ మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల వీరుడిగా బట్లర్‌, అత్యధిక వికెట్ల ధీరుడిగా చాహల్‌ రాజస్థాన్‌ను ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 20న రాజస్థాన్‌తో ఆడే చివరి మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించాలంటే చెమటోడ్చక తప్పదు.

ఇదీ చూడండి: 'కోహ్లీ స్లెడ్జింగ్ వేరే లెవెల్.. ఆరోజు భయంతో చచ్చిపోయా'

ABOUT THE AUTHOR

...view details