తెలంగాణ

telangana

ETV Bharat / sports

వామ్మో.. ఇదేం షాట్​రా బాబు.. బంతి స్టేడియం దాటేసిందిగా! - రొవ్‌మెన్ పొవెల్ భారీ సిక్స్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్​ ఓ భారీ సిక్స్​ నమోదైంది. విండీస్​ బ్యాటర్​ కొట్టిన దెబ్బకి బంతి ఏకంగా స్టేడియం దాటేసింది. దీంతో అక్కడే ఉన్న మిగతా ప్లేయర్లు, ప్రేక్షకులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

westindies vs Zimbabwe huge six video viral
వెస్టిండీస్ జింబాబ్వే భారీ సిక్స్​

By

Published : Oct 19, 2022, 7:50 PM IST

టీ20 ప్రపంచకప్‌ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. జింబాబ్వేతో బుధవారం జరిగిన రౌండ్‌-1 మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో భారీ సిక్స్​ నమోదైంది. వెస్టిండీస్ పవర్ హిట్టర్ రొవ్‌మెన్ పొవెల్(28; 21 బంతుల్లో 1x4, 2x6) కొట్టిన బంతి స్టేడియం బయటకు వెళ్లి పడింది.

మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జింబాబ్వే బౌలర్ ముజరబాని మూడో బంతిని రొవ్‌మెన్ పొవెల్ శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని షార్ట్ బాల్‌గా సంధించాడు. కానీ.. గంటకు 137 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతిని.. రొవ్‌మెన్ పొవెల్ చిన్నపాటి పాదాల కదలికతో బలంగా ఫుల్ చేశాడు. షాట్ అతను ఆశించినట్లు కనెక్ట్ అవడంతో బంతి 104 మీటర్లు దూరం వెళ్లి స్టేడియం వెలుపల పడింది.

రొవ్‌మెన్ పొవెల్ షాట్ ఆడిన తీరుకి బౌలర్ ముజరబాని షాక్​ అయ్యాడు. అనవసరంగా శరీరంపైకి బంతిని వేశానే అనేలా హావభావాల్ని కనబర్చాడు. అలానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అకేల హొసెన్ ఆ షాట్‌ను అలానే చూస్తూ నోరెళ్లబెట్టేశాడు. కానీ ఆ తర్వాత బంతికే రొవ్‌మెన్ పొవెల్ మరో సిక్స్ కొట్టబోయి ఔటైపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

కాగా, ఈ మ్యాచ్​లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ జాన్సన్‌ ఛార్లెస్‌ (45) రాణించగా.. రోమన్‌ పావెల్‌ (28), అకీల్‌ హొసేన్‌ (23*) పర్వాలేదనిపించారు. జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా 3 వికెట్లు తీయగా, ముజారబానీ 2 వికెట్లు పడగొట్టాడు.

ఆపై ఛేదనకు దిగిన జింబాబ్వే ఆరంభంలో ధాటిగా ఆడినప్పటికీ.. ఆపై తేలిపోయింది. 122 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్లు విస్లే (27), చకబ్వా (13) వెనుదిరగడంతో ఆపై వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్‌ చేరారు. చివర్లో ల్యూక్‌ జోగ్వే (29), ర్యాన్‌ బర్ల్‌ (17) విండీస్‌ విజయాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. అల్జారీ జోసెఫ్‌ 4 వికెట్లు, జాసన్‌ హోల్డర్‌ 3 వికెట్లు తీసి విండీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. గ్రూప్‌-బిలో ఉన్న స్కాట్లాండ్‌, జింబాబ్వే, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ ఒక్కో మ్యాచ్‌ గెలిచి తలో 2 పాయింట్లతో ఉన్నాయి. శుక్రవారం వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ పోటీ పడనుండగా.. అదేరోజు స్కాట్లాండ్‌, జింబాబ్వే తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన రెండు జట్లు సూపర్‌-12లోకి అడుగుపెట్టనున్నాయి.

ఇదీ చూడండి:ఆ మహిళా క్రికెటర్​పై సచిన్ కామెంట్స్​.. ఆమె చేసింది కరెక్టేనంటూ

ABOUT THE AUTHOR

...view details