కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆరోపించారు. సచిన్ తెందూల్కర్, మహ్మద్ అజారుద్దీన్‌ను పక్కన పెట్టిన విధంగానే గంగూలీని తొలగించారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడిని రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించినప్పుడు.. గంగూలీని ఎందుకు అధ్యక్షుడిగా కొనసాగించడం లేదని ప్రశ్నించారు. బీసీసీఐలో ఒకరి పదవి సురక్షితంగా ఉండటానికే.. గంగూలీని తప్పించారని ఆమె పేర్కొన్నారు.
మమతా బెనర్జీ గత వారం సైతం ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేశారు. సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా వంచించారని ఆరోపించారు. గంగూలీని ఐసీసీకి పంపాలని ప్రధాని మోదీకి మమత విజ్ఞప్తి చేశారు.
భాజపా స్ట్రాంగ్ కౌంటర్ : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై భాజపా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. టీఎంసీ బంగాలీ సెంటిమెంట్‌కు తెరలేపి.. రాజకీయం చేయాలని భావిస్తోందని విమర్శించింది. సౌరభ్ గంగూలీని మాత్రమే కాకుండా.. రోజర్ బిన్నీని సైతం అవమానిస్తున్నారని ఎదురుదాడి చేసింది.