లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఐదో రోజు(సోమవారం) ఆటలోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నాలుగో రోజు ఆటలో సారథి కోహ్లీ-అండర్సన్ మధ్య వాగ్వివాదం జరగగా సోమవారం జరుగుతున్న ఆటలో బుమ్రా-బట్లర్ మధ్య వివాదం నెలకొంది.
ఐదో రోజు ఆటలో బుమ్రా, షమీ ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టారు. ఈ క్రమంలోనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బుమ్రాను బౌలర్ మార్క్ వుడ్ ఏదో అనగా.. తిరిగి మన పేస్ గుర్రం కూడా గట్టిగానే సమాధానమిచ్చాడు. ఇంతలో బట్లర్ కల్పించుకుని బుమ్రాను మరింత రెచ్చగొట్టాడు. ఈలోగా అంపైర్ వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశాడు. ఆ తర్వాత మార్క్ వుడ్ వేసిన తర్వాత ఓవర్ తొలి బంతికే బుమ్రా బౌండరీ బాది మరోసారి దీటుగా బదులిచ్చాడు.
ఈ గొడవను బాల్కానీ నుంచి చూస్తున్న కోహ్లీ అసహనానికి గురయ్యాడు. చాలా కోపంతో కనిపించాడు. ఆ తర్వాత బుమ్రా బౌండరీ బాదడంపై హర్షం వ్యక్తం చేస్తూ కనిపించాడు. మొత్తంగా బుమ్రా.. షమీ కలిపి తొమ్మిదో వికెట్‌కు 97 పరుగులు చేశారు.