Michael Vaughan Trolls: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది ఇంగ్లాండ్. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి 68 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం దక్కించుకుంది కంగారూ జట్టు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ ఇలా ఆలౌట్ కావడం ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అప్పట్లో వాన్ టీమ్ఇండియా గురించి చేసిన ట్వీట్‌ను తిరగతోడి అతడికే కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌తో పాటు నెటిజన్లు వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
రెండేళ్ల కిందట ఓ వన్డే మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ 92 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో మైఖేల్ వాన్ తన ట్విట్టర్‌కు పని చెప్పాడు. "భారత్ 92 పరుగులకే ఆలౌట్.. ఈ రోజుల్లోనూ ఏదైనా జట్టు వందలోపే ఆలౌట్ అవుతుందనే విషయాన్ని నమ్మలేకపోతున్నా" అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఆసీస్ బౌలర్ల ధాటికి 68 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. రూట్ (28), బెన్ స్టోక్స్ (11) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో వాన్ అప్పటి ట్వీట్‌ను ట్రోల్ చేస్తూ వసీం జాఫర్ పోస్టు పెట్టాడు. "ఇంగ్లాండ్ 68 ఆలౌట్" అని వాన్‌ను జాఫర్ ట్యాగ్ చేశాడు. ఇతడితో పాటు నెటిజన్లు వాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
వాన్ ఏ సమయంలో అన్నాడో కానీ..
వాన్ భారత్ 92 పరుగులకు ఆలౌటైన సందర్భంలో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తరచుగా చక్కర్లు కొడుతోంది. అతడు ఆ మాట ఏ సమయంలో అన్నాడో గానీ.. దాని తర్వాత నాలుగు సార్లు 90 పరుగుల లోపే ఆలౌటైంది ఇంగ్లాండ్. దీంతో 'మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.