Wasim Akram Ind Vs Pak Match: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమికి బాబర్ అజామ్ కెప్టెన్సీనే కారణమని మాజీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తొలుత బ్యాటింగ్‌లో అద్భుతాలు చేయలేకపోయిన అజామ్.. కెప్టెన్‌గా కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ముఖ్యంగా మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడి నిర్ణయాలను అక్రమ్ తీవ్రంగా తప్పుపట్టాడు. బౌలర్లను రొటేట్ చేసిన విధానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు. రోహిత్, కోహ్లీ వంటి కీలక వికెట్లను పడగొట్టిన స్పిన్నర్ మహమ్మద్ నవాజ్‌ను సక్రమంగా వినియోగించుకోలేదన్నాడు. చివరి ఓవర్లో నవాజ్‌ను రంగంలోకి దించినా పెద్దగా ప్రయోజనం లభించలేదన్నాడు. అసలు బాబర్ అటువంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదన్నాడు.
"నాకు ఈ టీ20 పిచ్ చాలా ఇష్టం. రెండు వైపుల నుంచి బౌలర్లు బౌన్సర్లు విసిరి వికెట్లు సాధించడాన్ని ఆస్వాదిస్తాను. అది చాలా మంచి మ్యాచ్.. చివరి దాకాసాగింది. ఈ మ్యాచ్‌లో బాబర్ ఓ తప్పు చేశాడు. 13 లేదా 14వ ఓవర్‌ను నవాజ్‌తో బౌలింగ్ చేయించాల్సింది. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. టీ20 మ్యాచ్‌ల్లో చివరి 3 లేదా 4 ఓవర్లలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించలేం. ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య వంటి వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అస్సలు అలా చేయలేం. ఈ మ్యాచ్‌లో నవాజ్ బాగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా పాక్ బౌలర్లు అందరూ మనస్ఫూర్తిగా శ్రమించారు" అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.