టీమ్ఇండియా విజయవంతమైన జట్టుగా నిలవాలంటే ప్రతి ఆటగాడిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma News) అన్నాడు. వచ్చే ఏడాదే మరో టీ20 ప్రపంచకప్ ఉండటం వల్ల నాణ్యమైన బౌలర్‌ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో బుధవారం (నవంబర్ 17) నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్ (Ind vs NZ Series) ముందు.. టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు.
ద్రవిడ్, రోహిత్ ప్రెస్ మీట్ కోహ్లీ పాత్రపై..
"ఒకరిద్దరిపైనే ఆధారపడితే విజయాలు సాధించలేం. అందుకే, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను మలుచుకుంటాం. ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తా. మీరు బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తాం. మా టీమ్‌లో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకోవడం ప్రస్తుతం మా ముందున్న అతి పెద్ద సవాల్. అలా అని ఇతర జట్ల వ్యూహాలను మేం అనుసరించం. మాకు ఏది సరిపోతుందో ఆ మార్గాన్నే అనుసరిస్తాం. ప్రతి ఆటగాడు మాకు ముఖ్యమే. అందుకే, వారిపై పని భారం పడకుండా చూస్తాం. మా జట్టులో కోహ్లి చాలా కీలక ఆటగాడు. అతడి పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు. జట్టు అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటాం"
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా టీ20 కెప్టెన్
మ్యాచ్‌లను గెలుస్తూనే జట్టును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు (Rahul Dravid News) ద్రవిడ్. క్రికెటర్లను నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు సహాయక సిబ్బందిగా తనను తాను మలచుకోవాల్సిన బాధ్యత ఉందన్నాడు.
"మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే. భవిష్యత్తులో జరుగనున్న ఐసీసీ టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టాం. అన్ని విభాగాల్లో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తాం. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాణించాలంటే ప్రతి ఒక్క ఆటగాడు ఫ్రెష్‌గా ఉండటం చాలా ముఖ్యం. కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికేలా చూస్తా. ఒకే ఆటగాడు అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. అందుకే జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లను తయారు చేసుకుంటాం"
-రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా హెడ్ కోచ్
టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగనుంది. హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం.
ఇదీ చూడండి:IND vs NZ: రోహిత్‌కు ద్రవిడ్ బౌలింగ్.. కోచ్‌గా ప్రయాణం షురూ