టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్, సూర్య మరో అరుదైన ఘనత సాధించారు. పురుషుల టీ20 ప్రపంచకప్ 2022లో ఐసీసీ ప్రకటించిన అత్యంత విలువైన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజా టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో నిలిచాడు.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (82*) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. బంగ్లాదేశ్‌తో 64, నెదర్లాండ్స్‌తో 62, ఇంగ్లాండ్‌తో 50 పరుగులు చేసి వైట్‌బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 239 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ కూడా చోటు దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్‌తో 51, దక్షిణాఫ్రికాతో 68, జింబాబ్వేతో 61 పరుగులు చేసి మూడు అర్థ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న ఈ ఆటగాడు అద్భుతమైన స్ట్రైక్‌రేట్(189.68)ను ప్రదర్శించాడు.
మొత్తం ఆరు దేశాల జట్లను ఇందుకోసం ఎంపిక చేశారు. కప్ గెలిచిన ఇంగ్లాండ్, రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్, సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత్, న్యూజిలాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇంగ్లాండ్ రెండో సారి టీ20 కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లు.. కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ జోస్ బట్లర్, సహచర ఓపెనర్ అలెక్స్ హేల్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సీమర్ సామ్ కరన్ పేర్లను ప్రస్తావిస్తూ ఐసీసీ తన జాబితాను విడుదల చేసింది. 128 పరుగులు, 8 వికెట్లతో టీమ్‌ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 12వ ఆటగాడిగా ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, పేసర్ షహీన్ షా అఫ్రిది సైతం ఈ జాబితాలో ఉన్నారు.
ఇదీ చూడండి:వన్డేలో యంగ్ ప్లేయర్ సంచలనం.. 400 ప్లస్ రన్స్.. రోహిత్ రికార్డ్ బ్రేక్