యూఏఈ వేదికగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ (T20 WC)కు సంబంధించిన డ్రాను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). ఇందులో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం వల్ల ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై సీనియర్ క్రికెటర్లతో పాటు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొట్టి కప్‌లో దాయాది జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. పాకిస్థాన్‌పై గెలుపు బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకోవాలని సూచించాడు. చిరకాల ప్రత్యర్థితో పోటీ పడేటప్పుడు మరింత ఎక్కువగా బాధ్యతగా ఉండాలని తేల్చి చెప్పాడు. తన అరంగేట్ర మ్యాచ్ పాక్‌పైనే జరిగిందని.. అప్పుడు తానెంతో హుషారుగా ఆడానని వెల్లడించాడు. అందరూ యువకులు అలా ఉండరని.. వారిపై మానసిక ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత సీనియర్లదేనని గంభీర్ తెలిపాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్ భావోద్వేగాలకు సంబంధించిందని సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఆటగాళ్లతో పాటు చూసే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం చాలా మంది వేచి చూస్తుంటారని చెప్పాడు. ఈ సందర్భంగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో బౌలౌట్‌కు దారితీసిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు ఉతప్ప.