Virat Kohli on Rahane: స్టార్ బ్యాటర్ ఆజింక్యా రహానె పేలవ ఫామ్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడికి అండగా నిలిచాడు. రహానె ఫామ్‌పై ఎవరూ ఒక అభిప్రాయానికి రాకూడదని అన్నాడు. ఇటువంటి సమయంలో జట్టు అతనికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
"రహానె ఫామ్‌ను చూసి నేను ఓ అభిప్రాయానికి రాలేను. ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని గురించి రహానెకు బాగా తెలుసు. గతంలో ఎన్నో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మేం అతడికి అండగా నిలవాలి. బయటవ్యక్తుల్లా బాగా ఆడినప్పుడు పొగడ్తలతో ముంచెత్తి, ఫామ్ కోల్పోయినప్పుడు తీవ్ర విమర్శలు చేయలేం"
--విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
కోహ్లీ ఫామ్‌పై..
మరోవైపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పైనా విమర్శలు వస్తున్నాయి. 2019 కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో పింక్ బాల్ టెస్టులో చివరగా కోహ్లీ శతకం చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లీ.. 'చేసిన తప్పులనే చేస్తే ఆటతీరు గురించి సమీక్షించుకోవాలి' అని అన్నాడు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్ఇండియా 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్.. మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన గంటలోపే ఆ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది.
సోమవారం ఉదయం జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. హెన్రీ నికోలస్ (44) పరుగులతో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది భారత్. టెస్టుల్లో భారత్‌కు ఇది పరుగుల పరంగా అత్యంత భారీ విజయం.
ఈ క్రమంలోనే టీమ్ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్‌తో సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 42 పాయింట్లు, 58.33 పర్సంటేజ్‌తో మూడో స్థానంలో నిలిచింది. 2021-23 ఎడిషన్‌లో తొలి టెస్టు సిరీస్ ఆడిన న్యూజిలాండ్ 4 పాయింట్లు, 16.66 పర్సంటేజ్‌తో 6వ స్థానానికి చేరుకుంది. శ్రీలంక 100 పర్సంటేజ్, 24 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ 66.66 పర్సంటేజ్‌తో రెండో స్థానం కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది భారత జట్టు.
ఇదీ చూడండి :డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?