virat kohli gets fifty: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి 1000 రోజులు గడిచాయి. విండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరమై.. కాస్త విరామం తీసుకుంటున్నప్పటికీ విరాట్ ఫామ్‌పై చర్చ కొనసాగుతోంది. వచ్చే ఆదివారం ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడనున్న వేళ.. కోహ్లీ ఫామ్ గురించి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"కోహ్లీ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోనున్నాడు. కోహ్లీ ఆడే అద్భుతమైన ఆటను ఇప్పుడు ప్రపంచం చూడబోతుంది. చాలా ప్రశాంతంగా, నమ్మకంగా తనపై ఏ భారం లేకుండా తిరిగి రానున్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఒక్క అర్ధశతకం చేస్తే విమర్శించే అందరినోళ్లూ మూతపడతాయి" అని మాజీ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
"కోహ్లీకి తన కెరిరీలో ఏం చేయాలో అవగాహన ఉంది. స్టార్ బ్యాట్స్‌మెన్స్ సరైన సమయంలో బాగా ఆడతారు. కోహ్లీ తిరిగి మునుపటిలా పుంజుకుంటాడు. ఇండియన్ టీంలో కోహ్లీ కంటే ఫిట్‌గా ఉండే ఆటగాడు లేడు. ఈ సుదీర్ఘ విరామం తనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సుదీర్ఘ విరామంలో తాను భవిష్యత్‌లో ఏం చేయాలన్న దానిపై పూర్తి అవగాహనతో తిరిగి వస్తాడు. కోహ్లీ గేర్ని మార్చి పుంజుకుంటాడు" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
"గత ఫిబ్రవరి నుంచి కోహ్లీ సరైన ఫామ్‌లో లేడు. కొంత విరామం తరువాత క్రీజులోనికి వస్తున్నందున పాకిస్థాన్‌పై ఆడే మ్యాచ్‌లో అర్ధశతకం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులకు కోహ్లీ మళ్లీ కొత్తగా కనిపిస్తాడని నా నమ్మకం. అతనికి లయ కుదిరితే తిరిగి ఫామ్‌లోని రావడానికి ఒక్క మ్యాచ్ చాలు. కోహ్లీ పాక్‌పై జరిగే మ్యాచ్‌లో 50 పరుగులు చేస్తే.. విమర్శించే అందరినోళ్లూ మూతపడతాయి. కోహ్లీలో ఇంకా పరుగుల దాహం తీరలేదు.. అతనో పరుగుల యంత్రం. గతంలో జరిగిందంతా చరిత్ర. ప్రజలు గతాన్ని ఎక్కువరోజులు గుర్తుపెట్టుకోలేరని అర్థమవుతుంది."
-రవిశాస్త్రి, టీమిండియా మాజీ కోచ్