IND vs SA: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. జట్టు కూర్పు, ఆటగాళ్ల బ్యాటింగ్ మీద దృష్టిసారించాలని, అనవసర విషయాల మీద కాదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గురువారం ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ (30) అశ్విన్ బౌలింగ్‌లో తొలుత ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తర్వాత బాల్ ట్రాకింగ్‌లో నాటౌట్‌గా తేలడంపై టీమ్‌ఇండియా సారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఏమైందంటే..?
అశ్విన్ వేసిన 21వ ఓవర్‌లో తొలుత అతడు ఎల్బీగా ఔటయ్యాడని అంపైర్ ప్రకటించడంతో ఎల్గర్ రివ్యూకు వెళ్లాడు. అక్కడ బంతి ట్రాకింగ్‌ను గమనించి ఎల్గర్ సైతం పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. అయితే, చివరికి బంతి వికెట్ల మీద నుంచి వెళ్లినట్లు కనిపించడంతో తిరిగొచ్చి బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ స్టంప్ మైక్ వద్దకెళ్లి తన నోటికి పనిచెప్పాడు.
దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్ స్పోర్ట్‌ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించాడు. "బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు" అని ఎంతో ఆగ్రహంగా అరుస్తూ కనిపించాడు.
తర్వాత కేఎల్ రాహుల్, అశ్విన్ సైతం.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక మ్యాచ్ జరుగుతుండగా పలు సందర్భాల్లోనూ కోహ్లీ ఏదో ఒకటి అంటుండటం కనిపించింది. దీంతో ఆ వీడియోలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అతడి తీరు సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు.
కాగా, ఇంకొందరు ఒకడుగు ముందుకేసి తొలుత జట్టు కూర్పు పైన.. ఆటగాళ్ల బ్యాటింగ్‌పై దృష్టిసారించమని హితవు పలుకుతున్నారు. మరోవైపు పలువురు విదేశీయులు టీమ్‌ఇండియా సారథిని ఆటలో నిషేధించాలని కూడా పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చూడండి:IND vs SA: మరోసారి డీఆర్‌ఎస్ దుమారం.. కోహ్లీ ఫైర్