ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. సుమారు మూడున్నరేళ్లు అంటే 1200పైగా రోజుల తర్వాత టెస్టుల్లో శతకం కొట్టి సుదీర్ఘ కాల నిరీక్షణకు తెరదించాడు. మార్చి 10న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట నాలుగో రోజుకి 240 బాల్స్‌లో 100 పరుగులు చేశాడు విరాట్. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తన చివరి సెంచరీని నమోదు చేశాడు. దీంతో 2019 తర్వాత విరాట్ తొలి సారి సెంచరీ చేసింది ఇప్పుడే. మ్యాచ్ మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ వస్తున్న విరాట్ 240 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టీ20ల్లో, వన్డేల్లో శతకాలతో అదరగొట్టి తన ఫామ్‌ను మెరుగుపరుచుకున్న విరాట్ టెస్టుల్లో మాత్రం సెంచరీ కోసం ఇంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇందుకోసం 41 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు విరాట్.
ఇకపోతే అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో కోహ్లీకిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మట్లలో కలిపి 75వ సెంచరీ. తన కెరీర్లో అత్యధిక బంతులు తీసుకొని మరీ సెంచరీ చేయడం ఇది రెండో సారి. ఇప్పుడు ఆసీస్ మ్యాచ్‌లో 240 బంతుల్లో దీనిని అధిగమించగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 289 బంతులను వాడుకున్నాడు.
మ్యాచ్ మూడో రోజు ఆట చివరికి కోహ్లీ ఓవర్‌నైట్ స్కోర్ 59 పరుగులతో నాటౌట్‌గా ఉంది. దీనికి నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి 29 పరుగులు జోడించి 88 రన్స్‌తో నిలకడగా ఆటను ఆడాడు. కాగా, ఆసీస్ బౌలర్లు కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్‌లు విరాట్‌ను పరుగులు తీయకుండూ నియంత్రించే క్రమంలో అతడు నిలకడగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ఆపకుండా ముందుకు సాగించాడు.