తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుజారాలా డిఫెన్స్‌.. సెహ్వాగ్‌లా ఎదురు దాడి చేయగలడు! - టీమ్​ఇండియా

U19 World Cup: అది మే నెల.. మధ్యాహ్నం ఎండలో పదేళ్ల బాలుడు చొక్కా, ప్యాంటు లేకుండా డాబా మీద పడుకున్నాడు. ఎండ వేడికి కన్నీళ్లు వస్తున్నా లేవడం లేదు. తల్లి వచ్చి అడుగుతున్నా ససేమిరా అంటున్నాడు. క్రికెట్‌ మీద అంత పిచ్చి ఉంటే దుస్తులు లేకుండా ఎండలో పడుకో.. అప్పుడు చూస్తా నీ పట్టుదల అని అతని తండ్రి రెచ్చగొట్టేలా అన్న మాటలతో ఆ పిల్లాడు అలా చేస్తున్నాడు. చివరకు భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తండ్రి.. ఆ పిల్లాడికి ఆటపై ఉన్న తపన చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదిగిన ఆ బాలుడు ఇప్పుడు అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అదరగొడుతున్నాడు. అతనే 17 ఏళ్ల గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌. టీమ్‌ఇండియా తరపున ఆడాలనే కల దిశగా సాగుతున్నాడు.

Sheikh Rashid
షేక్‌ రషీద్‌

By

Published : Feb 4, 2022, 7:46 AM IST

U19 World Cup: దేశం తరపున సీనియర్‌ స్థాయిలో క్రికెట్‌ ఆడడమే లక్ష్యంగా సాగుతున్న రషీద్‌ ప్రయాణం ఇప్పుడు అండర్‌-19 ప్రపంచకప్‌ వరకూ వచ్చింది. ఒడుదొడుకులు ఎదుర్కొన్న అతనికి తండ్రి షేక్‌ బాలిషా అండగా నిలుస్తున్నాడు. చిన్నతనం నుంచే రషీద్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి ప్రేమ. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బాలిషా.. తన తనయుడిని క్రికెట్‌ కోచింగ్‌కు పంపించాడు. ఈ పిల్లాడి ఆట చూసిన కోచ్‌లు అతనిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉందని గుర్తించారు. తండ్రి ప్రోత్సాహంతో అప్పటి నుంచి అతనికి క్రికెట్టే లోకమైంది. 2014లో పదేళ్ల వయసులో అండర్‌-14 రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు ఆంధ్ర క్రికెట్‌ సంఘాన్ని (ఏసీఏ)కి చెందిన మంగళగిరి అకాడమీలో చేరడం కోసం అతని కుటుంబం తిరిగి గుంటూరుకు మకాం మార్చింది. 13 ఏళ్ల వయసులో అతనికి ఏసీఏ తరపున ఇంగ్లాండ్‌లో రెండు నెలల పాటు శిక్షణ పొందే అవకాశం దక్కింది.

షేక్‌ రషీద్‌

అలా ఎదిగాడు..

చిన్న వయసులోనే ఆట ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం రషీద్‌కు కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు తన బ్యాటింగ్‌లో ఎలాంటి తొందరపాటు కనిపించదు. కచ్చితత్వం, పూర్తి విశ్వాసంతో ఆడుతున్నాడు. అతణ్ని శిక్షణకు, మ్యాచ్‌లకు తిప్పడం కోసం బాలిషా ఉద్యోగాన్ని వదిలేశాడు. తన ఇంటి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాడమీకి రోజూ స్కూటర్‌పై కొడుకుని తీసుకెళ్లేవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా.. తన కొడుకు కలను తీర్చడం కోసం వాటిని దాటుకుంటూ వచ్చాడు. రషీద్‌ వివిధ స్థాయి వయసు విభాగాల్లో నిలకడగా రాణించాడు. విజయ్‌ మర్చంట్‌ అండర్‌-16 ట్రోఫీ (2018-19)లో ఆరు మ్యాచ్‌ల్లో 168.5 సగటుతో 674 పరుగులు చేశాడు. అందులో ఓ అజేయ ద్విశతకం కూడా ఉంది. గతేడాది వినూ మన్కడ్‌ అండర్‌-19 ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సహా 376 పరుగులు సాధించాడు. నిరుడు బంగ్లాదేశ్‌, భారత్‌ అండర్‌-19 ఎ, బి జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ రాణించాడు. భారత 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా రెండు మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేశాడు. నిలకడైన ప్రదర్శనతో ఆసియా కప్‌లో ఆడే జట్టుకు ఎంపికయ్యాడు. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై కీలక (90 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫైనల్లోనూ చెప్పుకోదగ్గ పరుగులు చేసి టైటిల్‌ నెగ్గడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. అతను పుజారా లాగా డిఫెన్స్‌ ఆడగలడు.. సెహ్వాగ్‌ లాగా ఎదురు దాడి చేయగలడు. క్రీజులో చివరి వరకూ ఉండాలని కోరుకుంటాడు. అన్ని రకాల షాట్లను పూర్తి కచ్చితత్వంతో ఆడే సామర్థ్యం అతనికుందని ఏసీఏ అకాడమీ కోచ్‌ కృష్ణారావు చెబుతున్నాడు.

వీవీఎస్ లక్ష్మణ్​తో రషీద్

ఆ నిరాశను దాటి..

రషీద్‌ ఓ దశలో అండర్‌-14, అండర్‌-16 స్థాయిలో అనుకున్న ప్రదర్శన చేయలేక తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. క్రికెట్‌ వదిలేద్దామని కూడా అనుకున్నాడట. తన కొడుకు ప్రతిభపై నమ్మకమున్న తండ్రి అతడిలో విశ్వాసం నింపి.. నిరంతరం ఆటపై దృష్టి సారించేలా చేశాడు. ఇప్పుడు ప్రపంచకప్‌ మధ్యలో కొవిడ్‌ బారిన పడడం వల్ల రషీద్‌ మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఆరోగ్యం గురించి ఇబ్బంది లేదు కానీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నానని బాధ పడ్డాడు. తన సత్తా చాటే అవకాశం కోల్పోతానేమోనని ఆవేదన చెందాడు. కానీ తిరిగి కోలుకుని ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అడుగుపెట్టి లయ అందుకున్నాడు. ఇప్పుడు సెమీస్‌లో కెప్టెన్‌ యశ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతోనే వెలుగులోకి వచ్చి ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగిన విరాట్‌ కోహ్లీని ఆరాధించే రషీద్‌ కూడా అదే బాటలో సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

కెప్టెన్​ యశ్​తో రషీద్

ఇదీ చూడండి:కోహ్లీ అలా చేస్తాడని అనుకోలేదు: శార్దుల్ ఠాకుర్

ABOUT THE AUTHOR

...view details