Top Players In IPL Mini Auction :రానున్న వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం దుబాయ్ వేదికగా ఈ నెల 19న మినీ వేలం జరగనుంది. ఇప్పటికే పలు జట్లు తమకు నచ్చిన ప్లేయర్లు ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసుకున్నాయి. అయితే మినీ వేలంలో దగ్గర పడుతున్న వేళ మిగతా ఆటగాళ్లు తమ పేర్లనుఈ వేలంలో నమోదు చేసుకున్నారు. అయితే అందులో కొందరు తొలిసారి ఐపీఎల్ ఆడనుండగా, మరికొందరేమో 2023 వరల్డ్ కప్‌లో అదరగొట్టి ఈ మిని వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి ఆ స్టార్ ప్లేయర్లు ఎవరో ఓ లుక్కేద్దామా.
1. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)
ఈ లిస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2016 - 2017 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం మరోసారి ఐపీఎల్ ఆడేందుకు బరిలోకి దిగనున్నాడు. 29 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ ఇటీవలే జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టుపై 120 బంతుల్లో 137 పరుగులు చేసి తన జట్టుకు మరపురాని విజయన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ట్రావిస్ ఈ వేలంలో భారీ ధరకు అమ్ముడే పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు కెప్టెన్ పాట్ కమిన్స్ తన జట్టుకు ఆరో ప్రపంచకప్‌ను అందించిన స్టార్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్‌లోనూ మంచి ఫామ్ కనబరిచిన కమిన్స్, 2024 ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు తన పేరును నమోదు చేసుకున్నాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌ని దృష్టిలో ఉంచుకుని గత సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఐపీఎల్లో రాణించాలని నిర్ణయించుకున్నాడు. ఇక ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో ఇతడ్ని భారీ ధరకు కొని, తన సేవల్ని ఉపయోగించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
3. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్రకు ఈ వేలంలో మంచి ధర పలికే అవకాశముంది. భారతీయ మూలాలు కలిగిన ఈ స్టార్ క్రికెటర్ గత ప్రపంచకప్ టోర్నీలో అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణించాడు. 10 ఇన్నింగ్స్‌లు ఆడి 64.22 సగటుతో 578 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
4. గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా)
ఇటీవలే జరిగిన 2023 ప్రపంచకప్‌లో అత్యద్భుతమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ రానున్న మినీ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 20 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో నిలకడగా వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ఈ ప్లేయర్‌ను భారీ ధరకు దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడతాయి.