Suryakumar yadav century: ఇంగ్లాండ్‌తో మూడో(చివరి) టీ20లో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్‌కే హైలైట్. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవడం వల్ల టీమ్‌ఇండియాకు పరాజయం తప్పలేదు. కానీ, సూర్య శతకం భారత అభిమానులనే కాదు.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో సహా ఆ దేశ అభిమానులను కూడా ఆకట్టుకొంది.
మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ పోరాడిన తీరు అద్భుతం. బౌలర్ ఎలాంటి బంతి వేసినా సూర్య బౌండరీకి పంపించాలనుకుంటే... తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఫీల్డర్ లేని ప్రదేశంలోకి బాల్‌ని తరలించడం అతడి ప్రత్యేకత. ఆఫ్‌సైడ్ సిక్సర్లు.. స్ట్రయిట్ ఫోర్లు.. ఫైన్ లెగ్ వైపు సూర్య బాదిన బౌండరీలతో ట్రెంట్‌బిడ్జ్ మైదానంలో పరుగుల వరద పారింది. దీంతో టీ20ల్లో సూర్య తన తొలి శతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు ట్విటర్ వేదికగా సూర్యను అభినందించారు.