Titas Sadhu Bowling :2023 ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా మహిళల జట్టు.. ఫైనల్స్‌లో శ్రీలంక పై అద్భుత విజయాన్ని నమోదు చేసి పసిడిని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో భారత్.. చిన్న టార్గెట్‌ను సైతం కాపాడుకొని 19 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మాత్రం.. టీమ్ఇండియా మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు గురించి. ఈ 18 ఏళ్ల అమ్మాయి సోమవారం ఫైనల్స్‌లో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. అసలు ఈ టిటాస్ సాధు ఎవరంటే..
స్పోర్ట్స్ పట్ల ఆసక్తి..టిటాస్ సాధు.. బంగాల్‌కు చెందిన మాజీ అథ్లెట్ రణదీప్ సాధు కుమార్తె. ఆమెకు చిన్నప్పటినుంచే క్రీడలపై ఆసక్తి ఎక్కువ. స్కూల్ డేస్‌లో స్విమ్మింగ్, స్ర్పింటింగ్లో ఆమె టాప్‌లో ఉండేదట. అయితే టిటాస్ సాధు తండ్రి రణదీప్ బంగాల్ హుగ్లీలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ అకాడమీలో తన తండ్రి రణదీప్‌కు.. టిటాస్ అడపాదడపా సహాయం చేసేది. అలా టిటాస్పై క్రికెట్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఓ రోజు వర్షం పడుతుండగా రణదీప్ తన కుమార్తెను బౌలింగ్ చేయమని అడిగాడట. టిటాస్ వెంటనే బంతి అందుకొని వర్షంలోనే బౌలింగ్ చేసి తనకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని చాటుకుందట.
13 ఏళ్లకే తొలి ప్రయత్నం.. టిటాస్ 13 ఏళ్ల వయసులో బంగాల్ స్టేట్ లెవల్ క్రికెట్ జట్టులో స్థానం కోసం ప్రయత్నించింది. కానీ అప్పుడు ఆమె సెలెక్ట్ కాలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా.. నిరంతరం శ్రమిస్తూ, తన నైపుణ్యాలు మెరుగుపర్చుకొని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 16 ఏళ్ల వయసులో సీనియర్ బంగాల్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది.