తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీరు గెలిచారు.. దేశాన్ని గెలిపించారు! - కపిల్​దేవ్​

ఓ ధ్యాన్​చంద్​, ఓ అభినవ్​ బింద్రా, ఓ నీరజ్​ చోప్డా, ఓ కపిల్​ దేవ్​, ఓ మహేంద్ర సింగ్​ ధోనీ.. భారత గడ్డపై పుట్టి దేశానికే గర్వకారణంగా నిలిచిన వీరులు వీరు. వీరి వ్యక్తిత్వం, వీరి నాయకత్వ లక్షణాలతో దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. క్రీడల పరంగా దేశ చరిత్రలో నిలిచిపోయిన కొన్ని ఘట్టాలను మరోమారు గుర్తుచేసుకుందాం.

Throwback at the top moments of Indian sports history
చక్​దే ఇండియా..

By

Published : Aug 15, 2021, 9:30 AM IST

75వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఎందరో సమరయోధుల త్యాగాలకు ప్రతీక.. మరెందరో మహానుభావుల కష్టానికి దక్కిన ప్రతిఫలం. నాటి గాంధీ, నెహ్రూ నుంచి.. నేటి మోదీ​ వరకు.. ఈ పుడమి ఎందరో గొప్ప నేతలను అందించింది. అటు క్రీడల్లోనూ ఎందరో మట్టిలో మాణిక్యాలు ఉద్భవించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఇప్పటివరకు భారత్​ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పి, దేశానికే గర్వకారణంగా నిలిచిన పలువురు క్రీడాకారులు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వారి మరపురాని విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం.

ఓ కపిల్​ దేవ్​.. ఓ ధోనీ..

భారత్​లో క్రికెట్​ అంటే ఓ ఆట కాదు.. ఓ మతం. ఈ క్రీడపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'క్రికెట్​ ఈజ్​ మై రిలీజియన్​.. సచిన్​ ఈజ్​ మై గాడ్​' అన్న నినాదాలు దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

మలుపుతిప్పిన కపిల్​సేన

అయితే క్రికెట్​కు మన దేశంలో ఆదరణ మొదలైంది మాత్రం 1983 ప్రపంచకప్​ తర్వాతే అని చెప్పుకోవాలి. కపిల్​ దేవ్(Kapil Dev worldcup)​ సారథ్యంలో టీమ్​ఇండియా ప్రపంచకప్​ను ముద్దాడి.. ప్రపంచానికి భారత్​ సత్తాను చాటిచెప్పింది. ముఖ్యంగా.. పేరు వింటేనే కాళ్లు, చేతులు వణికిపోయే నాటి వెస్టిండీస్​ జట్టు మీద గెలవడం అంటే మాటలు కాదు. లార్డ్స్​లో ప్రపంచకప్​ పట్టుకుని కపిల్​ దేవ్​ దిగిన ఫొటోకు దేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.

వాస్తవానికి కపిల్​ దేవ్​ జట్టు గెలిచిందే కానీ.. ఆ అనుభూతిని మాత్రం భారతీయులు పొందలేకపోయారు. అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాలు చాలా తక్కువగా ఉండేవి. ధనికుల నివాసాల్లో తప్ప.. వేరే ఇళ్లల్లో టీవీ సెట్లు పెద్దగా కనపడేవి కాదు. అందువల్ల ఆ మధుర క్షణాలను చాలా మంది భారతీయులు ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు.

ఇదీ చూడండి:-టీమ్ఇండియాను మరోస్థాయికి తీసుకెళ్లిన సారథి

ఆ తర్వాత దేశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాదాపు ప్రతి ఇంట్లో టీవీ ఉండే స్థాయికి ఎదిగింది. అటు టీమ్​ఇండియాకు ఎందరో ఆటగాళ్లు సారథ్యం వహించారు. మరుపురాని విజయాలను అందించారు. రికార్డుల మీద రికార్డులు సాధించారు. కానీ ప్రపంచకప్​పై భారత్​ చేయి పడలేదు. టీమ్​ఇండియా కప్​ గెలిస్తే కళ్లారా చూడాలనుకున్న అభిమానులకు ప్రతిసారీ నిరాశ తప్పలేదు. అప్పుడొచ్చాడు మహేంద్రుడు!

మళ్లీ ధోనీసేన రూపంలో..

మహేంద్ర సింగ్​ ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా 2007లో టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టీ20ల్లో తొలి ప్రపంచకప్​ అదే కావడం.. దాన్ని ధోనీ నేతృత్వంలోని యువ జట్టు దక్కించుకోవడం ఇక్కడ అసలైన ప్రత్యేకత. ఆ టోర్నీలో ఇంగ్లాండ్​పై యువరాజ్​ సింగ్​ చూపించిన విశ్వరూపం, ఒకే ఓవర్​లో 6 సిక్స్​లతో విరుచుకుపడ్డ తీరు చూసి అభిమానులు కాలర్​ ఎగరేసుకున్నారు.

'టీ20ల్లో ఏముంది.. వన్డేల్లో కప్​ కొడితేనే కదా మజా..!' అనుకునే వాళ్లకూ ఆ కోరికను కూడా తీర్చేశాడు ధోనీ. 2011 ప్రపంచకప్​ రూపంలో భారత్​కు మరో ఐసీసీ ట్రోఫీని అందించాడు(Dhoni world cup 2011). ముఖ్యంగా ఫైనల్​లో శ్రీలంకపై ధోనీ కొట్టి విన్నింగ్​ షాట్​.. దానికి రవిశాస్త్రి ఇచ్చిన కామెంటరీ, సచిన్​ను ఆటగాళ్లు తమ భుజాల మీద మోసుకెళ్లిన దృశ్యాలు.. కప్​పై భారత్​ చేయి వేసిన క్షణాలు భారతీయుల కళ్ల ముందు ఇప్పటికీ మెదులుతాయి. దేశానికే ఆ విజయం గర్వకారణంగా నిలిచిపోయింది. 28ఏళ్ల భారతీయుల కల సాకారమైంది.

2011ప్రపంచకప్​లో సచిన్​ని భుజాలపై మోసిన ఆటగాళ్లు

ఇదీ చూడండి:-MS Dhoni: 'కూల్'​గా మాయ చేసిన మహేంద్రుడు!

మువ్వన్నెల జెండా రెపరెపలు..

ఒలింపిక్స్​.. క్రీడల్లోనే అతిపెద్ద వేడుక. ఇక్కడ గెలవడం కోసం ఎన్నో ఏళ్ల ముందు నుంచే అథ్లెట్లు సన్నద్ధమవుతుంటారు. పసిడిని ముద్దాడాలనే లక్ష్యంతో ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇలాంటి వేదికల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాటి పురుషుల హాకీ జట్టు నుంచి నేటి నీరజ్​ చోప్డా వరకు ఎందరో అథ్లెట్లు గెలిచారు.. దేశాన్ని గెలిపించారు.

హాకీ..

ఒలింపిక్స్​లో ఇప్పటివరకు భారత్​ 10 స్వర్ణాలు గెలుచుకోగా..అందులో 8 హాకీకే వచ్చాయి. ఇది ఒక్కటి చాలు హాకీలో భారత్​ ఆధిపత్యం ఎలా సాగేదో చెప్పడానికి.

  • 1928 ఆమస్టర్​డ్యామ్​ ఒలింపిక్స్​ ఫైనల్​ మ్యాచ్​లో ప్రత్యర్థిపై భారత్​ 29-0 తేడాతో గెలుపొందింది. తొలి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆ 29 గోల్స్​లో 14.. హాకీ మాంత్రికుడు ధ్యాన్​చంద్(Dhyan Chand hockey ka jadugar)​ ఖాతాలోనివే.
    హాకీ దిగ్గజం ధ్యాన్​ చంద్​
  • 1932 లాస్​ ఏంజెలిస్ ఒలింపిక్స్​​లో మూడు జట్లే పోటీ పడగా.. జపాన్​పై 11-1, అమెరికాపై 24-1 తేడాతో గెలుపొందింది టీమ్​ఇండియా. ఫలితంగా మరో గోల్డ్ ఖాతాలో వేసుకుంది.
  • 1936 బెర్లిన్​ ఒలింపిక్స్​లో ముచ్చటగా మూడోసారి స్వర్ణం గెలిచింది పురుషుల హాకీ జట్టు. ఫైనల్లో జర్మనీపై 8-1తేడాతో విజయం సాధించింది.
  • స్వతంత్ర భారతంలోను విజయాల పరంపరను కొనసాగించింది హాకీ టీమ్​. 1948 లండన్​ ఒలింపిక్స్​ ఫైనల్​లో గ్రేట్​ బ్రిటన్​పై 4-0 తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
  • 1952 హెల్సింకీ ఒలింపిక్స్​లో ప్రతికూల వాతవరణాన్ని తట్టుకుని మరీ అఖండ విజయాన్ని నమోదు చేసింది భారత బృందం.
  • 1956 మెల్​బోర్న్​లోనూ జట్టు పసిడి గెలిచింది. అయితే ఆ టోర్నీలో 5 మ్యాచ్​లు ఆడిన టీమ్​ఇండియా.. ఏ పోరులోనూ ప్రత్యర్థిని ఖాతా కూడా తెరవనివ్వలేదు. సింగపూర్​(6-0), అఫ్గానిస్థాన్​(14-0), అమెరికా(16-0), జర్మనీ(1-0), పాకిస్థాన్​(1-0)తేడాతో గెలిచి కప్​ను దక్కించుకుంది.
  • 1960 ఒలింపిక్స్​లో భారత్​ రికార్డుకు బ్రేక్​ పడింది. అప్పటివరకు వరుసగా 6 పసిడి పతకాలు సాధించిన టీమ్​ఇండియా.. ఆ ఒలింపిక్స్​లో వెనకడుగు వేసింది. పాకిస్థాన్​కు పసిడి దక్కింది. అయితే 1964 టోక్యో ఒలింపిక్స్​లో తిరిగి స్వర్ణాన్ని అందుకుంది పురుషుల హాకీ జట్టు. పాకిస్థాన్​తో జరిగిన ఫైనల్​లో 1-0 తేడాతో విజయం సాధించింది.
  • 1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణం భారత్​కు ఎంతో ప్రత్యేకం. 1964 తర్వాత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న భారత జట్టు వాటన్నింటినీ అదిగమించి 1980లో సత్తా చాటింది.

ఆ తర్వాత హాకీలో భారత్​ స్థానం పడిపోయింది. అప్పటివరకు అధిపత్యాన్ని కొనసాగించి ఒక్కసారిగా వెనకపడిపోయింది. పతకాలు కాదు కదా.. ఎన్నో సందర్భాల్లో ఫైనల్​కు అర్హత కూడా సాధించలేకపోయింది. అయితే ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో హాకీ జట్టు చెలరేగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత పురుషుల జట్టు కాంస్యం దక్కించుకుంది.

పురుషుల హాకీ జట్టు

మహిళల జట్టు పతకం తీసుకురానప్పటికీ.. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రశంసలు పొందింది. హాకీకి పూర్వవైభవం వచ్చే రోజులు దగ్గరపడ్డాయని టోక్యో ఒలింపిక్స్​తో హాకీ జట్టు సంకేతాలిచ్చింది!

మహిళల హాకీ జట్టు

ఇదీ చూడండి:-హాకీలో దేశానికి 27 పతకాలు తెచ్చిపెట్టింది ఆ ఊరే

షూటింగ్​.. జావెలిన్​ త్రో..

2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో షూటర్​ అభినవ్​ బింద్రా(Abhinav Bindra gold medal) చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో భారత్​కు తొలి పసిడిని అందించాడు. బింద్రా గెలుపుతో అనేకమంది యువత షూటింగ్​వైపు అడుగులు వేశారు.

ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​ అథ్లెటిక్స్ విభాగంలో టీమ్​ఇండియా 'పసిడి' ఆకలి తీర్చేశాడు అథ్లెట్​ నీరజ్​ చోప్డా(Neeraj Chopra gold medal). జావెలిన్​ త్రో ఫైనల్​లో 87.58మీటర్లు వేసి 'నీరజ్​.. నీకు సలాం' అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఆ త్రో వేసిన వెంటనే నీరజ్​ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం.. భారతీయులు ఎప్పటికీ మరచిపోలేరు.

నీరజ్​ చోప్డా

వీరితో పాటు.. సుశీల్ కుమార్, భజరంగ్ పునియా, రవి దహియా, లవ్లీనా, పీవీ సింధు, సైనా నెహ్వాల్​, మేరీకోమ్​, మీరాబాయి చాను వంటి అథ్లెట్లు ఒలింపిక్స్​లో సత్తా చాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు.

పారాలింపిక్స్​లోనూ సత్తా

పారాలింపిక్స్​లోనూ భారత్​ అద్భుత ప్రదర్శనలు చేసింది. జావెలిన్​ త్రోలో దేవేంద్ర జజారియా రెండుసార్లు స్వర్ణం(2004,2016) సాధించాడు. ఇతడితో పాటు రాజేంద్రసింగ్, గిరీష నాగరాజె గౌడ, మరియప్ప తంగవేలు, దేవేంద్ర జజారియా, దీపా మాలిక్, వరుణ్ సింగ్ భాటి విశ్వక్రీడల్లో పతకాలతో చెలరేగారు.

దేశ ప్రజలు వీరి ప్రదర్శన చూసి పులకరించారు. ప్రపంచ దేశాలు.. "వాహ్​ భారత్​!" అనుకునేలా చేశారు. ఎన్నేళ్లయినా.. మువ్వన్నెల జెండా రెపరెపలు ఇలాగే కొనసాగుతుంది. చక్​దే ఇండియా!

ఇదీ చూడండి:-పేదరికంపై 'క్రీడా'యుధం.. కష్టానికి ప్రతిఫలం!

ABOUT THE AUTHOR

...view details