తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత మహిళల క్రికెట్​.. ఎవరూ పట్టించుకోని స్థాయి నుంచి రూ.5 వేల కోట్ల రేంజ్​కు - T20 worldcup women cricket

వచ్చే మూడేళ్లలో మహిళల క్రికెట్‌ అత్యున్నత దశను అందుకుంటుందని గత నవంబరులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వ్యాఖ్యానించారు. ఆ తరవాత మూడు నెలలకే భారత మహిళల క్రికెట్‌ ఊహించని స్థాయికి చేరుకుంది. మహిళల ఐపీఎల్‌ అరంగేట్రంలోనే వేల కోట్ల రూపాయల స్థాయిని అందుకోగా, అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. క్రికెట్‌ అంటే పురుషుల క్రీడేనన్న భావజాలాన్ని పోగొట్టేందుకు మహిళల క్రికెట్‌ సాగించిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం.

Women cricket
Womens cricket: ఎవరూ పట్టించుకోని స్థాయి నుంచి రూ.5 వేల కోట్ల రేంజ్​కు

By

Published : Feb 10, 2023, 7:59 AM IST

రెండు దశాబ్దాల కిందట మహిళల క్రికెట్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ పెద్దగా శ్రద్ధ, ఆసక్తి ఉండేవి కాదు. అమ్మాయిలు క్రికెట్‌ ఆడితే ఎవరు చూస్తారులెమ్మన్న భావన ఉండేది. ఉచిత ప్రవేశం కల్పించినా వారి ఆటను చూడటానికి పట్టుమని వెయ్యిమంది అయినా స్టేడియానికి వచ్చేవారు కాదు. 2005లో మిథాలీ రాజ్‌ సారథ్యంలోని భారత జట్టు మహిళల ఒన్‌డే ప్రపంచకప్‌ తుదిపోరు ఆడుతుంటే, అప్పుడు స్టేడియంలో ఉన్న వీక్షకుల సంఖ్య కేవలం రెండువేల పైచిలుకు! అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ లేకపోవడంతో టీవీ ఛానళ్లు, ప్రాయోజిత సంస్థలు వారిని పట్టించుకోలేదు. అప్పటికి మహిళల క్రికెట్‌ బీసీసీఐ పరిధిలో లేకపోవడంతో అంతర్జాతీయ ఆటలు ఆడినా పారితోషికాలు అంతంత మాత్రంగానే ఉండేవి. సరైన ప్రయాణ, వసతి సౌకర్యాలు లేక క్రీడాకారిణులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయినా కేవలం ఆట మీద ప్రేమతోనే కొందరు మహిళలు ఇందులో కొనసాగుతూ వచ్చారు.

మార్పు మొదలు.. బీసీసీఐ 2006లో మహిళల క్రికెట్‌ను తన చేతుల్లోకి తీసుకోవడంతో మార్పు మొదలైంది. నెమ్మదిగా మ్యాచ్‌లు పెరిగి, వసతులు మెరుగుపడ్డాయి. పారితోషికాలు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగి, కెరీర్‌ విషయంలో కొంచెం భరోసా ఏర్పడింది. దాంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య పెరిగింది. వసతులు, ప్రోత్సాహకాల కంటే అభిమానుల ఆదరణ, ఆదాయం పెరగడం ఎంతో ముఖ్యం. ఆ మార్పేమీ అంత తేలిగ్గా రాలేదు. మహిళల ఆటను బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టినా మొదట్లో పెద్దగా ఆదరణ కనిపించలేదు. అప్పట్లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే అమ్మాయిల ఆటలో వేగం, మజా లేకపోవడమే అందుక్కారణం! అయితే హర్మన్‌ ప్రీత్‌, స్మృతి మంధాన లాంటి నవతరం క్రికెటర్ల రాకతో పరిస్థితి మారుతూ వచ్చింది. పురుషులకు దీటుగా అమ్మాయిలూ భారీ షాట్లు ఆడటం, దూకుడుగా బ్యాటింగ్‌ చేయడం, ప్రత్యర్థులతో హోరాహోరీ తలపడటం, నిలకడగా విజయాలు సాధించడంతో వారి ఆటకు పెద్దసంఖ్యలో అభిమానులు పెరిగారు.

భారత మహిళల క్రికెట్లో 2017 ఒన్‌డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ను ఒక గొప్ప మలుపుగా చెప్పాలి. హర్మన్‌ప్రీత్‌ మహిళల క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌ (171 నాటౌట్‌)తో ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠ జట్టుపై భారత్‌కు అద్భుత విజయాన్ని అందించడంతో- ఒక్కసారిగా అందరి దృష్టీ మహిళల జట్టుపై పడింది. షెఫాలీ వర్మ సహా మరికొందరు యువ క్రికెటర్ల రాకతో మహిళల జట్టులో దూకుడు పెరిగింది. వారు ఆడుతున్నప్పుడు స్టేడియాలు నిండటం మొదలైంది. ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడ్డ 2020 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 86 వేల మందికి పైగా హాజరుకావడంతో ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం కళకళలాడిపోయింది. హర్మన్‌, స్మృతి, షెఫాలీ లాంటి మహిళా స్టార్లు పురుష క్రికెటర్లకు దీటుగా అభిమానులను సంపాదించుకున్నారు. వారి ఆట చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు స్టేడియాలకు తరలివస్తున్నారు.

ముందుంది మంచి కాలం.. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని జట్టు నిలకడగా విజయాలు నమోదుచేస్తూ దిగ్గజ శక్తిగా ఎదుగుతోంది. అండర్‌-19 స్థాయిలో తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలిపిన యువ క్రికెటర్లు భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు. మహిళల క్రికెట్‌కు బీసీసీఐ చక్కటి ప్రోత్సాహం అందిస్తోంది. పురుష క్రీడాకారులకు ఇస్తున్నట్లే మహిళలకూ ఒప్పందాలు మొదలుపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కల్పించింది. పురుషులతో సమానంగా అమ్మాయిలకూ చెల్లింపులు జరపాలని కొన్ని నెలల కిందటే చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెటర్లకు ప్రాయోజిత సంస్థల సహకారమూ ఇప్పుడు బాగానే అందుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే, ఈ ఏడాది ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మరొక ఎత్తు. పురుషుల క్రికెట్‌ ఐపీఎల్‌తో ఎంతగా మారిపోయిందో తెలిసిందే. మహిళల క్రికెట్లోనూ ఈ లీగ్‌ అలాంటి మార్పే తెస్తుందన్న అంచనాలున్నాయి. మహిళలకు లీగ్‌ ప్రారంభిస్తే జట్లను కొనడానికి ఎవరు ముందుకువస్తారని అన్నవారున్నారు. అటువంటి వారిప్పుడు అయిదు జట్లకు మొత్తంగా రూ.4,700 కోట్ల ధర పలికేసరికి ముక్కున వేలేసుకున్నారు! ఈ లీగ్‌ మీడియా హక్కులు రూ.951 కోట్లు పలకడం, ప్రసారదారు ఒక్కో మ్యాచ్‌కు ఏడు కోట్ల రూపాయలు చెల్లించబోతుండటం అనూహ్యమే. ఈ లీగ్‌ ద్వారా మరింత ఆర్థిక భరోసా లభిస్తుంది కాబట్టి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. చాలామంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. వారందరికీ ప్రపంచ మేటి క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వారు వేగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. సీనియర్‌ మహిళల జట్టు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఆడబోతోంది. అందులో సత్తాచాటి కప్పు అందుకుంటే, ఆపై మహిళల లీగ్‌ కూడా విజయవంతమైతే- మన మహిళల క్రికెట్‌ అత్యున్నత స్థాయికి చేరడం ఖాయం!

దారిచూపిన మిథాలీ

భారత మహిళల క్రికెట్‌ ఉన్నతిలో హైదరాబాదీ తార మిథాలీ రాజ్‌ పాత్ర ఎనలేనిది. తొలినాళ్లలో పేరూ డబ్బూ లేకపోయినా ఆమె ఈ ఆటలోకి అడుగుపెట్టారు. చెల్లింపులు నామమాత్రంగానే ఉన్నా ఎన్నో కష్టాలకు ఓర్చి కెరీర్‌ కొనసాగించారు. రైలులో జనరల్‌ బోగీల్లో ప్రయాణించి, స్టేడియాలకు అనుబంధంగా ఉండే చిన్నపాటి గదుల్లో సర్దుకుని మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లలో మిథాలీ ఒకరు. మహిళల క్రికెట్‌ సంఘం నుంచి సాయం అందని స్థితిలో చందాలతో విదేశీ పర్యటనలకు వెళ్ళారు. భారత్‌ తరఫున ఒక జట్టును తయారుచేసుకోవడం కష్టమైన రోజుల్లో, జులన్‌ గోస్వామి లాంటి కొందరి అండతో జట్టును ముందుకు నడిపించారు. కొన్నేళ్లపాటు బ్యాటింగ్‌ భారం మొత్తం తానే మోశారు. మహిళల క్రికెట్లో అసాధారణ ఘనతలు, ఎన్నో రికార్డులు మిథాలీ వశమయ్యాయి. ఆమెను చూసే ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్లోకి వచ్చారు. ఇప్పుడు జట్టులో మెరుపులు మెరిపిస్తున్న ఎంతోమందికి మార్గదర్శి- మిథాలీయే!

ఇదీ చూడండి:IND VS AUS: జడ్డూ చేసిన ఆ మ్యాజిక్ చీటింగా?

ABOUT THE AUTHOR

...view details