న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది. మంగళవారం నేపియర్ వేదికగా ఇరుజట్ల మధ్య చివరి టీ20 జరగనుంది. తొలి టీ20 వర్షార్పణంకాగా రెండో టీ20లో 65 పరుగుల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది.
మూడో టీ20 కోసం జట్టులో భారీగా మార్పులేమీ ఉండవని ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్, శుభమన్ గిల్ వంటి ఆటగాళ్లు తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. రెండో టీ20లో ఇషాన్ కిషన్‌తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. ఐతే సూర్యకుమార్ యాదవ్ అద్వితీయ, విధ్వంసరకర ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడంలో టీమిండియా విఫలమవుతోంది. రెండో టీ20లో ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించగా...పంత్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గట్లుగా సత్తా చాటాలని టీమిండియా కోరుకుంటోంది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే టీమిండియా కట్టడి చేయగలిగింది.