తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2022, 7:11 AM IST

ETV Bharat / sports

IND VS BAN: బంగ్లాతో చావో రేవో మ్యాచ్​.. మనోళ్లు ఏం చేస్తారో?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రెండో వన్డే బుధవారం మిర్‌పూర్‌ వేదికగా జరగనుంది. ఇదే మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలివన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలుపొందిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని టీమిండియా కోరుకుంటోంది.

Teamindia vs Bangladesh match updates
బంగ్లాతో చావో రేవో మ్యాచ్​.. మనోళ్లు ఏం చేస్తారో?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా...రెండో వన్డే కోసం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైతే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను భారత జట్టు చేజార్చుకోనుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సత్తా చాటాలని రోహిత్‌ సేన కోరుకుంటోంది. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ వైఫల్యాలు భారత జట్టును వెంటాడుతున్నాయి. స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. సరికొత్త దృక్పథంతో భారత బ్యాటర్లు రెండో వన్డేలో సత్తా చాటాల్సి ఉంది. చివరిగా ధోనీ సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే భారత్ నెగ్గింది. ఆ చరిత్ర పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా 10 నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఎలాంటి విధానాన్ని అవలంభించనుంది అనేది కీలకంగా మారింది.


తొలివన్డేలో మిడిల్‌ ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్​ రాహుల్‌ ఒక్కడే 70 బంతుల్లో 73 పరుగులు చేసి బ్యాటింగ్‌లో రాణించగలిగాడు. కొన్నాళ్లుగా పవర్‌ ప్లే ఓవర్లలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. పంథా మార్చి ధాటిగా ఆడతామని పదే పదే చెబుతున్నా అది అమల్లోకి రావడం లేదు. ముఖ్యంగా డాట్‌ బాల్స్‌ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తొలివన్డేలో భారత జట్టు ఆడింది 42 ఓవర్లే అయినా అందులో 25 ఓవర్లు డాట్‌ బాల్స్‌ కావడం గమనార్హం. కొన్నేళ్లుగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్ట్రయిక్‌ రేటు తగ్గుతూ వస్తోంది. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడకపోయినా శుభమన్‌ గిల్‌, సంజూ శాంసన్‌ను విశ్రాంతి పేరిట ఈ వన్డే సిరీస్‌కు సెలక్టర్లు పక్కనపెట్టారు. మిర్‌పూర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం కాకపోయినప్పటికీ అక్కడ 186 పరుగుల స్కోరు మాత్రం ఏమాత్రం సరిపోదు. మరోవైపు తొలిమ్యాచ్‌లో భారత బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్ చేసినా బంగ్లాదేశ్‌ విజయం కోసం 50కిపైగా పరుగులు కావాల్సిన సమయంలో ఆ జట్టు చివరి వికెట్‌ను పడగొట్టలేకపోయారు. ఐతే ప్రత్యర్థి ముందు సరైన లక్ష్యాన్ని ఉంచడంలో విఫలమైన భారత బ్యాటర్లే తొలివన్డే పరాజయానికి మూలకారణం. సిరీస్‌లో పుంజుకోవాలంటే భారత బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.


పిచ్‌... రెండో వన్డేలో కూడా స్పిన్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. పేసర్లకు అస్థిర బౌన్స్‌ లభిస్తుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

ఇదీ చూడండి:హెడ్​​కోచ్​గా ద్రవిడ్​ను తప్పించనున్న బీసీసీఐ.. కారణం అదేనా!

ABOUT THE AUTHOR

...view details