న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారతే ఫేవరెట్ అని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మిగతా జట్ల కంటే టీమ్‌ఇండియా చాలా ముందుందన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో లక్ష్మణ్ ఈనాడుతో ముచ్చటించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ అవకాశాలేంటి?
రెండేళ్లలో సొంతగడ్డపై, విదేశాల్లో టీమ్‌ఇండియా ఆధిపత్యం కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమ్‌ఇండియాకు తిరుగులేదు. బలమైన రిజర్వ్ బెంచ్ కూడా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. కోహ్లీ చివరి మూడు టెస్టుల్లో ఆడకపోయినా.. సీనియర్లు లేకపోయినా.. తొలి టెస్టు ఓడిన తర్వాత కూడా టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకుని సిరీస్ గెలుచుకుంది. అవకాశం లభిస్తే సత్తాచాటేందుకు జట్టులో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. డబ్ట్యూటీసీ ఫైనల్లో విరాట్ సేననే ఫేవరెట్. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులాడటం కివీస్‌కు కలిసొచ్చేదే. మన వాళ్లకు ప్రాక్టీస్ లేకపోవడం ప్రతికూలత.
రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి?
కివీస్ ప్రధాన బలం బౌలింగే. ఆ జట్టులో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులు వారికి నప్పుతాయి కూడా. అయితే రెండేళ్ల డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో కివీస్ 70 నుంచి 80 శాతం మ్యాచ్‌లు సొంతగడ్డపై ఆడింది. టీమ్‌ఇండియా మాత్రం ఇంటా.. బయటా సత్తాచాటింది. విదేశాల్లో కివీస్ కంటే ఎక్కువ మ్యాచ్‌లాడింది. బౌలింగ్‌లోనూ మంచి వనరులు భారత్ సొంతం. ఇషాంత్ అనుభవం.. బుమ్రా, షమీల పేస్ కలిసొచ్చేవే. సిరాజ్ ఉండనే ఉన్నాడు. అశ్విన్, జడేజాల రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు కలిగి ఉండటం భారత్‌కు పెద్ద సానుకూలాంశం. బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు.
ఇంగ్లాండ్ పరిస్థితులు ప్రతికూలమా.. అనుకూలమా..?
ఇంగ్లాండ్‌లో పిచ్‌లు, పరిస్థితులకు అలవాటు పడటం అత్యంత కీలకం. డబ్ల్యూటీసీ తొలి ఫైనల్ కాబట్టి మంచి వికెట్ ఉండాలని ఐసీసీ కోరుకుంటుంది. వర్షం పడినా.. వాతావరణం మబ్బులు పట్టి చల్లగా మారినా పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తుంది. బంతి స్వింగ్ అవుతుంది. ఎండ కాస్తే బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టొచ్చు. ఇలాంటి పరిస్థితులు బ్యాట్స్‌మెన్‌కు మంచి అవకాశం. కొత్త బంతితో జాగ్రత్తగా ఆడటం ముఖ్యం. ఆరంభంలో వికెట్లు పడకపోతే టీమ్‌ఇండియాను ఆపలేరు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పచ్చికతో ఉన్న వికెట్లు ఇవ్వొచ్చు. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనే టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. పచ్చిక వికెట్లు ఇస్తే ఇంగ్లాండ్‌కూ కష్టమే. భారత పేసర్లను ఎదుర్కోవడం ఆషామాషీ కాదు.