Sunil Gavaskar on teamindia vs southafrica: దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమ్‌ఇండియాకు మరోసారి నిరాశే ఎదురైందని క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోవడం వల్ల.. భారత ఆటగాళ్లకు ఈ ఓటమి ఓ పీడకలగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు.
మూడో టెస్టు ఓటమి అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది' అని చెప్పాడు. కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ స్పందించారు. "సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంత వల్ల.. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్నాను. అయితే, చివరి రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికా గొప్పగా పుంజుకుంది. ఆ రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు అయ్యిందంటే.. భారత్ ఎంత పేలవంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు" అని గావస్కర్ పేర్కొన్నాడు.