తెలంగాణ

telangana

ETV Bharat / sports

శాంసన్​ రికార్డ్సే బెటర్​.. అయినా పంత్​కే ఛాన్స్​లు ఎందుకు?

గత కొద్ది రోజులుగా క్రికెట్​ ప్రపంచంలో పంత్​-సంజూ శాంసన్​ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. పంత్​ను పక్కనపెట్టి సంజూకు అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్​లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి రికార్డులు ఎలా ఉన్నాయి? ఎవరు మెరుగ్గా ఉన్నారో తెలుసుకుందాం..

Pant Sanju records
పంత్ కన్నా శాంసన్​ రికార్డ్సే బెటర్​.. అయినా అతడికే ఛాన్స్​లు ఎందుకు?

By

Published : Dec 1, 2022, 4:44 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌లోకి ముందే అడుగు పెట్టినా.. అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం రిషభ్‌ పంత్ కంటే సంజూ శాంసన్‌ వెనుకడుగే. ఫామ్‌ లేక ఇలా జరిగిందా అంటే.. కాదనే సమాధానం వస్తుంది. పంత్‌ కంటే సంజూదే బ్యాటింగ్ యావరేజ్‌ ఎక్కువ. మరీ ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు) గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సంజూ శాంసన్‌ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనేలేదు.

రిషభ్‌ పంత్ 2017లో టీమ్‌ఇండియాకు ఎంపిక కాగా.. పంత్‌ కన్నా రెండేళ్ల ముందు అంటే 2015లోనే భారత జెర్సీని ధరించాడు సంజూ. ఇద్దరూ మొదట టీ20ల్లోనే అరంగేట్రం చేశారు. కానీ రిషభ్‌ పంత్‌ టెస్టుల్లోకి అడుగు పెట్టగా.. సంజూకి అవకాశం దక్కలేదు. కెరీర్‌ ఆరంభంలో రిషభ్‌ పంత్ కీలక ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. టెస్టుల్లోనూ దూకుడైన ఆటతీరుతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ గడ్డపైనా సెంచరీ (125*) సాధించి ఔరా అనిపించాడు. అలాగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మైదానాల్లోనూ విజృంభించాడు. కానీ గత కొన్ని రోజులుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం పంత్‌ పూర్తిగా విఫలం కావడం విమర్శలపాలైంది.

కారణమదేనా..?.. ఒకే ఏడాదిలో జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌.. పలు ద్వైపాక్షిక సిరీస్‌లను పరిగణనలోకి తీసుకొంటే పంత్‌తో పోలిస్తే సంజూకి అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ శైలి అని నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే పంత్‌ లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటర్ కాగా.. సంజూ కుడిచేతి వాటం కలిగిన ఆటగాడు. ప్రస్తుతం ఉన్న భారత మిడిలార్డర్‌లో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ పంత్‌ మాత్రమే. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, అక్షర్ పటేల్ ఎడమ చేతివాటం అయినా.. వీరంతా పూర్తిస్థాయి బ్యాటర్లు కాదు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా గడ్డపైనే పేస్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించడం కూడానూ పంత్‌ వైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.

గత 10 మ్యాచుల్లో వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉందంటే..?.. * గత పది వన్డేల్లో రిషభ్‌ పంత్ ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలతో 336 పరుగులు చేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్‌ ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 284 పరుగులు చేశాడు. కానీ యావరేజ్‌ మాత్రం సంజూదే అధికం కావడం గమనార్హం.

* ఇక టీ20ల విషయానికొస్తే.. సంజూ శాంసన్‌ ఒక్క అర్ధశతకంతో 223 పరుగులు చేశాడు. కానీ రిషభ్‌ పంత్‌ మాత్రం దారుణంగా విఫలం కావడం విశేషం. కేవలం నాలుగు సార్లు మాత్రమే డబుల్‌ డిజిట్ సాధించాడు. మొత్తం కలిపి 89 పరుగులు చేశాడు. అందుకే పంత్‌ను తప్పించి సంజూకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ అభిమానుల నుంచి వస్తోంది.

మెగా టోర్నీలపై ప్రభావం.. పంత్‌కు బదులు.. వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్న సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌తోపాటు ఆసియా కప్‌ జరగనున్నాయి. వీరిద్దరి స్థానాలపై జట్టు యాజమాన్యం తేల్చకపోతే మెగా టోర్నీల్లో భారత్‌ ప్రదర్శనపై తీవ్ర ప్రభావంపడే అవకాశం లేకపోలేదు. గత టీ20 ప్రపంచకప్‌లో దినేశ్‌ కార్తిక్‌పై భారీ అంచనాలు పెట్టుకొని పంత్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. ఆసీస్‌ గడ్డపై బాగా ఆడే అతడిని పక్కన పెట్టడం కూడా పంత్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఉంటుందని పలువురి విశ్లేషణ. అందుకే వచ్చే మెగా టోర్నీల్లో ఎవరిని ఆడించాలనే దానిపై బీసీసీఐ క్లారిటీతో ఉండాలి.

పంత్‌ కెరీర్‌ గణాంకాలు ఇలా..

* 31 మ్యాచుల్లో 43.32 సగటుతో 2,123 పరుగులు చేశాడు. అందులో ఐదు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హయ్యస్ట్‌ స్కోరు 159*.

* 27 వన్డేల్లో 36.52 సగటుతో 840 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 125*.

* అంతర్జాతీయ టీ20ల్లో 64 మ్యాచుల్లో 22.43 యావరేజ్‌తో 987 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 65. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

సంజూ కెరీర్‌ ఇలా..

* అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఏడేళ్లలో సంజూ కేవలం 11 వన్డేలను మాత్రమే ఆడాడు. 66 సగటుతో 330 పరుగులు సాధించాడు.

* టీ20లు.. 16 మ్యాచుల్లో 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 77 పరుగులు.

ఇదీ చూడండి:T20 worldcup: కోహ్లీపై పాక్​ స్టార్ బౌలర్​ వైరల్ కామెంట్స్​.. ఇంకెవరూ అలా చేయలేరంటా!

ABOUT THE AUTHOR

...view details