తాజా టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులను బెంబేలిస్తున్న క్రికెటర్ ఎవరు? అదిరిపోయే షాట్లతో ధనాధన్ అడుతుంది ఎవరు? అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎలాంటి బంతైనా సరే బౌలర్లపై విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మైదానంలో ఈ అద్భుతాలు ఎలా సాధ్యమవుతున్నాయి అంటే.. సరైన ప్రణాళికతో పాటు తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా ఓ కారణమని చెపాడు స్కై. మరి సూర్య డైట్ సీక్రెట్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం..
ఈ ప్రపంచ నంబర్ టీ20 బ్యాటర్‌తో కలిసి పనిచేస్తోన్న ప్రముఖ డైటీషియన్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ శ్వేతా భాటియా.. సూర్య ఆహారపు అలవాట్ల గురించి మీడియాతో పంచుకున్నారు. గత ఏడాది కాలంగా శ్వేత బృందం సూర్యతో కలిసి పనిచేస్తోంది. ఫిట్‌నెస్ పెంచుకునే క్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషన్‌పై ఈ బ్యాటర్‌కు వీరు అవగాహన కల్పిస్తున్నారు. "ఐదు పాయింట్ల అజెండాతో సూర్య డైట్‌ను మేం తీర్చిదిద్దాం. అతడిలో చురుకుదనం పెంచేలా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాం. సూర్య డైట్ నుంచి అధిక కార్బోహైడ్రేట్ పదార్థాలను తొలగించాం. నట్స్, ఒమెగా 3 ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఇస్తున్నాం. ఇక గుడ్లు, మాంసం, చేపల వంటి మాంసాహారం నుంచి అధిక స్థాయిలో ప్రొటీన్లు అందేలా చూస్తున్నాం. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాడు. అథ్లెట్‌కు హైడ్రేషన్ చాలా ముఖ్యం. అందుకే ఎలక్ట్రోలైట్‌లు ఉండే ద్రవాలు ఇస్తున్నాం. శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో అతడి ప్రదర్శన పెంచేలా బూస్టింగ్ సప్లిమెంట్‌లు తీసుకుంటున్నాడు" అని శ్వేత వివరించారు.