WTC India VS Australia Final 2023 : ఇటీవలే లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ పరాజయానికి పనిభారమే కారణమని.. అందుకు అనుగుణంగా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేలా బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని వస్తున్న సూచనలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు. అది ప్రాక్టికల్‌గా వర్కవుట్ అయ్యే పనికాదని వివరించాడు.
Sourav Ganguly Comments On Workload : అయితే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసి దాదాపు మూడు వారాలు కావొస్తుంది. ఈ పోరులో మెన్ ఇన్ బ్లూ కంగారూల చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్‌తో తీవ్ర వర్క్‌లోడ్‌ను ఎదుర్కున్నందునే మన ఆటగాళ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సరిగ్గా ఆడలేకపోయారని వాదన కూడా ఉంది. దీంతో ఆటగాళ్లపై పనిభారం తగ్గించేలా ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ పెద్దలు కలిసి చర్చలు జరపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో అలాంటివి చాలా కష్టమని దాదాచెప్పుకొచ్చాడు.
"ఇలాంటి థియరీని నేను అంగీకరించను. ఎందుకంటే గత ఐపీఎల్‌లో ఆడిన అజింక్య రహానె కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి మెప్పించాడు. కాబట్టి, వర్క్‌లోడ్ అనే థియరీని నేను నమ్మను. ఆసీస్ ఆటగాళ్లు కామెరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ఐపీఎల్‌లో ఆడిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వచ్చారు. అయినా ఎటువంటి ఒత్తిడి లేకుండా రాణించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అందరికి కొంత సమయం దొరికింది. టెస్టు ఫార్మాట్‌లకు అనుగుణంగా మనల్ని మలుచుకునేందుకు తగినంత సమయం ఉందనేది నా భావన. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. వన్డే లేదా టెస్టు క్రికెట్ ఆడినా పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టి ఇదేమీ పెద్ద సమస్య కానే కాదు. ఇతర ఫార్మాట్లు ఆడి వచ్చినా సరే ప్లేయర్ సరైన వ్యూహంతో బరిలోకి దిగితే గనుక టెస్టు మ్యాచ్‌లోనూ నిలకడగా రాణించేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి."
- సౌరభ్ గంగూలీ, మాజీ సారథి
యశస్విని సెలెక్ట్ చేయడం మంచిదే.. కానీ..
West Indies Tour India : రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా జూలై 12 నుంచి విండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ప్రకటించిన టెస్టు తుది జట్టులోకి భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు గంగూలీ. మరోవైపు గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌తోపాటు అభిమన్యు ఈశ్వరన్‌ను టీమ్‌లోకి తీసుకోకపోవడంపై సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. వీరికి కూడా అవకాశం ఇస్తే బాగుండేది అని వ్యాఖ్యానించాడు.