చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమ్ఇండియా.. సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. మార్చి 2019 నుంచి అన్ని ఫార్మాట్లలో వరుసగా 24 సిరీస్‌లలో భారత్ విజయం సాధించింది. చివరగా 2019 ఆరంభంలో ఆసీస్‌పైనే భారత్ సిరీస్‌ను కోల్పోయింది.
దాంతో పాటు రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం గమనార్హం. అయితే వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కూడా కోల్పోయింది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఆసీస్‌తో 113 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా సమంగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ విన్నింగ్ శాతం పరంగా కంగారూల జట్టు టాప్ ర్యాంక్‌కు చేరుకుంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ గ్రౌండ్లో కోహ్లీ- స్టోయినిస్..!
మరోవైపు, మూడో వన్డేలో టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, ఆసీస్ బౌలర్ స్టోయినిస్‌ల మధ్య ఒక ఆసక్తికర ఘటన జరిగింది. పిచ్ స్లో వికెట్‌కు అనుకూలిస్తుండడంతో స్టార్క్‌తో కలిసి మార్కస్ స్టోయినిస్ బంతిని పంచుకున్నాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో కేఎల్ రాహుల్, కోహ్లీలు క్రీజులో ఉన్నారు. బంతి వేసిన తర్వాత స్టోయినిస్ కోహ్లీని తన భుజాలతో నెట్టాడు.
ఇది గమనించిన కోహ్లీ.. స్టోయినిస్‌కు అడ్డంగా వచ్చి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. కేవలం కళ్లతోనే ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు. ఆ తర్వాత స్టోయినిస్ చిన్నగా నవ్వడంతో అసలు విషయం అర్థమైంది. నిజానికి ఇద్దరి మధ్య గొడవ ఫన్నీగానే జరిగింది. ఇది తెలియని అభిమానులు అరె నిజంగానే ఇద్దరికి గొడవైనట్లుందే అన్నట్లుగా చూశారు. అయితే కోహ్లీ తన అగ్రెసివ్‌నెస్‌తో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. అయితే అందులో చాలా భాగం ఫన్నీవేలోనే కోహ్లీని చూశాం. మ్యాచ్ జరిగేటప్పుడు తాను సీరియస్‌గా ఉండలేనని అందుకే కాస్త హ్యూమర్ జోడించి ఆడుతానంటూ గతంలో చాలాసార్లు చెప్పాడు.
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లాభం లేకుండా పోయింది. 72 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ.. పెవిలియన్ చేరగానే టీమ్ఇండియా ఓటమి దిశలో పయనించింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్య(40 పరుగులు), జడేజాలు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖరారైపోయింది.