రెండు రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ అరంగేట్రం చేసి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన కెరీర్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు కోహ్లీ. నిజమే.. అతడే కాదు.. సగటు క్రికెట్ అభిమాని కూడా అతడి ఘనతల పట్ల గర్వంగా ఉంటాడు.
విరాట్‌కు ఉన్న పరుగుల దాహం, ఆకలి ఎవరికీ ఉండదంటారు సహచరులు. ఆ ఆకలి.. గెలుపు కోసం. ఎన్ని సార్లు గెలిచినా.. మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉండాలి.. భారత్‌ను గెలిపిస్తూనే ఉండాలనే ఆకలి. ఈ క్రమంలోనే పరుగుల వరద పారించాడు. ఎంతగా అంటే.. అతడిని 'రన్ మెషీన్' అని పిలుచుకునేంత. కెరీర్లో ఇప్పటికే 23 వేల పైచిలుకు పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో (Virat Kohli News) అత్యధిక పరుగుల (3225) వీరుడిగా ఉన్నాడు.
రికార్డుల రారాజు
కోహ్లీ (Virat Kohli Centuries) ఖాతాలో 70 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక సార్లు (57) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మూడో క్రికెటర్ కోహ్లీ. అత్యధిక సార్లు (19) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న రెండో ఆటగాడూ అతడే. ప్రపంచ క్రికెట్లోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా (GOAT) ఉన్నాడు.
అదే లోటు
వ్యక్తిగతంగా ఎన్ని ఘనతలు సాధించినా.. సగటు క్రికెట్ అభిమాని ట్రోఫీలనే లెక్కలోకి తీసుకుంటాడు. ఎన్ని టైటిళ్లు వచ్చాయనేదే లెక్క. అక్కడే కోహ్లీకి అదృష్టం లేదు. జట్టు కోసం నిరంతరం తపిస్తూ, స్వేదం చిందిస్తూ ఆడే అతడిని ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్‌గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే అవి అతడిని కుంగదీయలేవు.
"అందరిలా నువ్వూ విఫలమవుతావ్. తిరిగి ఎదిగేందుకు ప్రయత్నించడాన్ని మాత్రం మర్చిపోకు. ఒకసారి ఓడితే మళ్లీ మళ్లీ ప్రయత్నించు" రెండేళ్ల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా విరాట్.. తనకు తానే రాసుకున్న (Virat Kohli Birthday Wishes) లేఖ ఇది. అయితే అతడు ఓడిపోయాడు అనడానికి లేదు. కలిసిరాలేదంతే! కిందపడ్డాడంటే రెట్టింపు స్థాయిలో పుంజుకోవడం కోహ్లీకి బాగా తెలుసు. ఆ సమయం కోసమే ప్రతీ అభిమాని ఎదురుచూస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతానికే కాదు ఎప్పటికీ అతడే రారాజు! హ్యాపీ బర్త్‌డే 'కింగ్' కోహ్లీ.
ఇదీ చూడండి:15 ఏళ్ల విరాట్‌కు.. కోహ్లీ స్వీయసందేశం..!