తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: టైటిల్​​ సాధించే దిశగా.. జట్టును నడిపించు నాయకా​! - టీ20 వరల్డ్​ కప్​ 2022

ICC T20 World Cup 2022 : అంచనాల్లేకుండా వచ్చి 2007 వరల్డ్​ కప్​ టైటిల్​ అందుకున్న టీమ్​లో అతడొకడు. అంచెలంచెలుగా ఎదిగి.. భారత జట్టు సారథి అయ్యాడు. ప్రస్తుతం గంపెడు సమస్యలతో సతమతవుతున్న జట్టును టీ20 వరల్డ్​ కప్​ టైటిల్​ సాధించే దిశగా ఎలా నడిపిస్తారనేది ఆసక్తిగా మారింది.

ICC T20 World Cup 2022
ICC T20 World Cup 2022

By

Published : Oct 21, 2022, 6:58 AM IST

Updated : Oct 21, 2022, 7:15 AM IST

ICC T20 World Cup 2022 : 2007 సెప్టెంబరు 20..టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌కు కీలక మ్యాచ్‌. 10.3 ఓవర్లకు స్కోరు 61/4. ఇక ఈ మ్యాచ్‌లో కష్టమే అనుకుంటున్న దశలో వచ్చాడు ఓ కుర్రాడు. కెరీర్లో అతడికది రెండో టీ20 మాత్రమే. పైగా ప్రపంచకప్‌లో, అప్పటి మేటి జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాతో.. అందులోనూ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో క్రీజులోకి వచ్చాడు. కానీ ఇవేమీ ఆలోచించకుండా సహజ ప్రతిభను చాటుతూ మేటి ఇన్నింగ్స్‌ ఆడాడా కుర్రాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన పేరు మార్మోగేలా చేసిన ఆ యువ క్రికెటరే రోహిత్‌ శర్మ. అప్పుడు అంచనాల్లేకుండా బరిలోకి దిగి కప్పు పట్టేసిన జట్టులో సభ్యుడైన రోహిత్‌.. ఇప్పుడు అంచనాల భారాన్ని అందుకోలేక తడబడుతున్న జట్టును ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం.

2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన ధోని నాయకత్వంలోని యువ జట్టుపై అంతగా అంచనాల్లేవు. కానీ ఆ జట్టు అద్భుతాలు చేసింది. ఫేవరెట్లను పక్కకు నెట్టి కప్పు ఎగరేసుకుపోయింది. కానీ ఆ తర్వాతి నుంచి ప్రతిసారీ మన జట్టుపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కానీ ఒక్కసారీ అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఇంకో అయిదు పర్యాయాలు ప్రపంచకప్‌లో జట్టును నడిపించిన ధోని కూడా 2007 ప్రదర్శనను పునరావృతం చేయించలేకపోయాడు.

2014లో టైటిల్‌కు చేరువగా వెళ్లి ఫైనల్లో బోల్తా కొట్టింది. గత ఏడాది కోహ్లి సారథ్యంలో ప్రపంచకప్‌ ఆడిన జట్టు కనీసం సెమీస్‌ కూడా చేరలేకపోయింది. ఆ టోర్నీ మొదలవడానికి ముందే ఇదే టీ20 కెప్టెన్‌గా తన చివరి టోర్నీ అని చెప్పిన విరాట్‌.. అన్నట్లే పగ్గాలు వదిలేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా వన్డే, టెస్టు పగ్గాలు కూడా అతడికి దూరమయ్యాయి. మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ శర్మ సారథి అయ్యాడు.

ఐపీఎల్‌లో సాధారణ జట్టుగా ఉన్న ముంబయి ఇండియన్స్‌ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లి రికార్డు స్థాయిలో అయిదుసార్లు ఆ జట్టుకు కప్పు అందించిన ఘనత రోహిత్‌ శర్మ సొంతం. ఈ రికార్డు చూసే కొన్నేళ్ల ముందు నుంచే రోహిత్‌ను టీ20 కెప్టెన్‌ చేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. కొంచెం ఆలస్యంగా గత ఏడాది అతను జట్టు పగ్గాలందుకున్నాడు.

ఈ ఏడాది కాలంలో కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు మరీ గొప్పగా లేదు. అలాగని తీసిపడేసేలా లేదు. గత నెల ఆసియా కప్‌లో జట్టు ఘోర వైఫల్యం రోహిత్‌ నాయకత్వ లక్షణాలపై అనేక సందేహాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ అతడి నాయకత్వ పటిమకు అతి పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు.

ఎన్నో సవాళ్లు..
పేరుకు పెద్ద జట్టే కానీ.. ఈసారి ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలుస్తుందా అంటే భారత అభిమానులు ధీమాగా ఔనని చెప్పలేని పరిస్థితి. తిరుగులేని ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో కనిపిస్తున్న ఇంగ్లాండ్‌, బలమైన జట్టుతో సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా, అండర్‌డాగ్‌గా అడుగు పెట్టి చక్కటి ప్రదర్శన చేసే న్యూజిలాండ్‌ లాంటి జట్లను దాటి.. అనేక సమస్యలతో సతమతం అవుతున్న టీమ్‌ఇండియాకు కప్పు గెలవడం తేలికేం కాదు.

ప్రధాన పేసర్‌ బుమ్రాతో పాటు దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యారు. భువనేశ్వర్‌ ఫామ్‌ పేలవం. షమి చాలా విరామం తర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడుతున్నాడు. ఇటు పేస్‌, అటు స్పిన్‌ విభాగాల్లో ధీమానిచ్చే బౌలర్‌ కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో కీలకమైన రోహిత్‌, కోహ్లి, రాహుల్‌లలో నిలకడ లోపించింది. ఇలా భారత జట్టును అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.

అయితే టోర్నీ ముంగిట ఇలా ఎన్ని ఇబ్బందులు కనిపించినా.. ప్రత్యర్థులు బలంగా ఉన్నా.. టీ20 క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. శ్రీలంకను నమీబియా, వెస్టిండీస్‌ను స్కాట్లాండ్‌ ఓడించడాన్ని బట్టి చూస్తే కలిసొచ్చిన రోజు ఎవరు ఎవరినైనా ఓడించవచ్చు. సరైన కెప్టెన్‌ ఉండి, జట్టును సమర్థంగా నడిపిస్తే.. ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తే.. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించవచ్చు. అయిదారు మ్యాచ్‌లు గెలిస్తే చాలు.. ప్రపంచకప్‌ సొంతమవుతుంది.

ఐపీఎల్‌లో అనేక సార్లు కెప్టెన్‌గా తన నైపుణ్యాన్ని చాటిన రోహిత్‌.. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రపంచకప్‌లో జట్టును నడిపించాల్సిన అవసరముంది. బ్యాట్స్‌మన్‌గా జట్టును ముందుండి నడిపించి.. అందుబాటులో ఉన్న బౌలింగ్‌ వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటే, ఫీల్డింగ్‌ ఏర్పాట్లలో తన అనుభవాన్ని చూపిస్తే.. రోహిత్‌ చేతిలోకి ప్రపంచకప్‌ చేరడం కష్టమేమీ కాదు.

తొలి మ్యాచే పాకిస్థాన్‌తో కాబట్టి ఆటగాళ్లలో కసి, పట్టుదల వాటంతట అవే వస్తాయి. ఈ మ్యాచ్‌లో జట్టు గెలిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలన్నీ పక్కకు వెళ్లిపోతాయి. జట్టుకు సెమీస్‌ బెర్తు ఖరారైతే.. ఆ తర్వాత రోహిత్‌ సేన ఎక్కాల్సిన మెట్లు రెండే. మరి రోహిత్‌ తనపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకుంటాడా? మళ్లీ టీమ్‌ఇండియాను పొట్టి కప్పు విజేతగా నిలబెడతాడా?

35
ఇప్పటివరకు రోహిత్‌ శర్మ నాయకత్వంలో ఆడిన 45 టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా సాధించిన విజయాలు. ధోని (41 విజయాలు) తర్వాత అత్యంత విజయవంతమైన భారత టీ20 కెప్టెన్‌ రోహితే.

ఇవీ చదవండి:పాక్​ పర్యటనకు టీమ్​ఇండియా.. కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఏం అన్నారంటే?

'కుట్రపూరితంగానే గంగూలీని తప్పించారు'.. దాదాకు మద్దతుగా దీదీ

Last Updated : Oct 21, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details