తెలంగాణ

telangana

ETV Bharat / sports

Vijay Hazare Trophy: టైటిల్​ బరిలో తమిళనాడు, హిమాచల్​ప్రదేశ్​

Vijay Hazare Trophy: తమిళనాడు, హిమాచల్​ప్రదేశ్​ జట్లు విజయ్​ హజారే ట్రోఫీ టోర్నీ ఫైనల్​కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీస్​లలో సౌరాష్ట్రపై తమిళనాడు, సర్వీసెస్​పై హిమాచల్​ ప్రదేశ్​ గెలుపొందింది.

vijay hazare trophy news latest
విజయ్​ హజారే ట్రోఫీ

By

Published : Dec 25, 2021, 7:02 AM IST

Vijay Hazare Trophy: అఖిల భారత విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ ఫలితం ఆఖరి బంతికి తేలింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు సాధించింది. వికెట్‌ కీపర్‌ షెల్డన్‌ జాక్సన్‌ (134; 125 బంతుల్లో 11×4, 4×6) సెంచరీతో సత్తాచాటగా.. విశ్వరాజ్‌ జడేజా (52), అర్పిత్‌ (57) అర్ధ శతకాలతో మెరిశారు. తమిళనాడు బౌలర్లలో రఘుపతి సిలాంబరసన్‌ (3/54), విజయ్‌ శంకర్‌ (4/72) ప్రతిభ కనబరిచారు. అనంతరం తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 314 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబా అపరాజిత్‌ (122; 124 బంతుల్లో 12×4, 3×6), బాబా ఇంద్రజిత్‌ (50), వాషింగ్టన్‌ సుందర్‌ (70) సత్తాచాటారు.

తమిళనాడు గెలుపునకు చివరి ఓవర్లో ఏడు పరుగులు కావాల్సి ఉండగా.. టెయిలెండర్లు సాయి కిషోర్‌ (12 నాటౌట్‌), రఘుపతి (2 నాటౌట్‌) మొదటి అయిదు బంతుల్లో 6 పరుగులు రాబట్టారు. ఆఖరి బంతిని సాయి కిషోర్‌ బౌండరీకి తరలించి తమిళనాడు ఉత్కంఠ విజయంలో భాగమయ్యాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా (5/62) అయిదు వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. మరో సెమీస్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్‌పై గెలుపొందింది. తొలుత హిమాచల్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు రాబట్టింది. ప్రశాంత్‌ చోప్రా (78), కెప్టెన్‌ రిషి ధావన్‌ (84), ఆకాశ్‌ వశిష్ట్‌ (45 నాటౌట్‌) మెరిశారు. బదులుగా సర్వీసెస్‌ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. రవి చౌహాన్‌ (45), కెప్టెన్‌ రజత్‌ పలివల్‌ (55) పోరాడినా ఫలితం లేకపోయింది. రిషి ధావన్‌ (4/27) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో తమిళనాడు, హిమాచల్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

ఇదీ చూడండి :IND Vs SA: కపిల్​ రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో ఘనత కోసం షమి

ABOUT THE AUTHOR

...view details