టీ20 ప్రపంచకప్ 2022లో దక్షిణాఫ్రికా దుమ్మురేపింది. తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు. దీంతో బంగ్లాదేశ్‌పై 104 భారీ పరుగుల తేడాతో గెలుపొందారు.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. రిలీ రోసోవ్, క్వింటన్ డికాక్ చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోసోవ్ 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. డికాక్ 63పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 2 వికెట్లు తీశాడు. అఫిఫ్, టస్కిన్, హసన్.. తలో వికెట్ తీశారు. ఇక 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో లిట్టన్ డాస్ (34) అత్యధిక స్కోరు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిక్ నోర్జే 4 వికెట్లు పడగొట్టగా... తబ్రిజ్ షంసీ మూడు వికెట్లు తీశాడు. రబడ, కేశవ్ మహరాజ్‌లకు చెరో వికెట్ తీశారు. శతకం చేసిన రోసోవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
రోసో అద్భుత ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమ్ఇండియా జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగి మరోసారి శతకం బాదాడు.