తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: సూపర్​-12లోకి ఏ జట్లు వెళ్లనున్నాయో? - టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌ నుంచి ఏ నాలుగు జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ ఎనిమిది జట్ల పరిస్థితేంటో చూద్దాం రండి.

T20 World Cup
T20 World Cup

By

Published : Oct 20, 2022, 7:04 AM IST

T20 World Cup Super 12: టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌ నుంచి ఏ నాలుగు జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయన్నది ఆసక్తికరం. గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున తొలి రౌండ్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ముందంజ వేస్తాయి. గ్రూప్‌-బిలో సమీకరణం స్పష్టంగానే ఉంది. రెండేసి మ్యాచ్‌లు ఆడిన నాలుగు జట్లు ఒక్కో విజయం సాధించాయి. ఇంకో మ్యాచ్‌ ఆడతాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో వెస్టిండీస్‌, జింబాబ్వేతో స్కాట్లాండ్‌ తలపడతాయి. గెలిచిన జట్లు సూపర్‌-12కు చేరుకుంటాయి. వర్షం కారణంగా మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోతే రన్‌రేట్‌ ఆధారంగా స్కాట్లాండ్‌, జింబాబ్వే ముందంజ వేస్తాయి. వర్షం పడే అవకాశాలు మెండుగానే ఉన్న నేపథ్యంలో విండీస్‌, ఐర్లాండ్‌లకు ఆందోళన తప్పట్లేదు.

ఇక గ్రూప్‌-ఎలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన నెదర్లాండ్స్‌ అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక ఓ మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడింది. నమీబియా కూడా ఒకటి గెలిచి, ఒకటి ఓడింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూఏఈ సూపర్‌-12 రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. ఆ జట్టు అత్యంత పేలవ రన్‌రేట్‌తో ఉంది. గురువారం నెదర్లాండ్స్‌తో శ్రీలంక, యూఏఈతో నమీబియా తలపడతాయి. నెదర్లాండ్స్‌కు ఓడినా ముందంజ వేసే అవకాశం ఉంటుంది. శ్రీలంక, నమీబియాలు గెలిస్తే మూడు జట్లు నాలుగేసి పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు ముందుకెళతాయి. నమీబియా, శ్రీలంకల్లో ఒక జట్టే గెలిస్తే.. అదే నెదర్లాండ్స్‌తో పాటు ముందంజ వేస్తుంది. రెండూ ఓడిపోతే రెండేసి పాయింట్లతో యూఏఈతో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న ఓ జట్టు ముందుకెళ్తుంది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ.

ABOUT THE AUTHOR

...view details