T20 World Cup Semis Finals: టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్తుల ఖరారుతో అసలైన సమరానికి తెరలేచింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఆడిన అయిదు మ్యాచుల్లో నాలుగు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. కప్పును ఒడిసి పట్టేందుకు రెండడుగుల దూరంలోనే ఉన్న నాలుగు ప్రధాన జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. గత ప్రపంచకప్‌లకు భిన్నంగా చివరి మ్యాచ్ వరకూ సెమీఫైనల్ బెర్తులు ఖరారు కాకపోవడం ఉత్కంఠను కలిగించింది. లీగ్ దశలో చివరి రోజు మ్యాచ్‌లతో సెమీఫైనల్ బెర్తులపై స్పష్టత వచ్చింది. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ 7 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకున్నాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఏడు పాయింట్లే ఉన్నా, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడం వల్ల ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.
ఆడిన అయిదు మ్యాచుల్లో కివీస్ మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకటి ఓడిపోయింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కీలక విజయం సాధించిన ఇంగ్లండ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొత్తం 5 మ్యాచ్‌లో మూడు గెలిచిన బ్రిటిష్ జట్టు ఒక దాంట్లో ఓడిపోగా, మరో మ్యాచ్ రద్దయింది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్ 2లో సెమీఫైనల్ బెర్తులు తేలిగ్గా ఖరారు అవుతాయని అంతా భావించారు.