సూర్య.. సూర్య.. సూర్య.. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వినిపించిన పేరు ఇది. స్టేడియం మొత్తం అభిమానులు ఈ పేరుతో హోరెత్తించారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా అతడి అద్భుత ప్రదర్శన.. యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. దీంతో ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. కానీ అతడు అంచనాలను తలకిందులు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే విఫలమై నిరాశపరిచాడు.
ఓ పట్టాన అర్థం కాదు.. గత టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. లీగ్ స్టేజ్‌లో ఎలా ఆడినా ఫర్వాలేదు.. కానీ సెమీస్‌లో సూర్య విఫలం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సూర్యకుమార్ ఆట ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ప్రదర్శనలో అతడు రెండు అడుగులు ముందుకేస్తే.. ఒకడుగు వెనక్కి వేయడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ తలపడింది. కివీస్‌పై టీ20ల్లో సెంచరీ (51 బంతుల్లోనే 111 పరుగులు) సాధించినా.. ఆ తర్వాత ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలబడితేనే 'స్టార్ బ్యాటర్' బిరుదుకు అర్థం ఉంటుంది.
టాలెంట్ ఎంత ఉన్నా అది అవసరం.. మిషన్- 2024లో భాగంగా సూర్యకుమార్ కీలక బ్యాటర్‌గా మారతాడని అందరి అంచనా. ఇలాంటి సూర్యకుమార్‌లో టాలెంట్‌కు కొదవేం లేదు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా హడలెత్తిస్తాడు. అయితే ఒక్కోసారి తొందరపాటుతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌నే తీసుకొంటే.. కీలకమైన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్‌కు ఇరుసులాంటి స్థానం. త్వరగా బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. వన్‌డౌన్ బ్యాటర్ ఎంత బాగా రాణిస్తే జట్టు మీద ఒత్తిడి అంత తగ్గిపోతుంది. కానీ సూర్యకుమార్ మాత్రం మూడో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే తన షాట్ కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. అదీనూ 10 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేశాడు. నిన్నటి వరకు ఇదే స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగేవాడు. క్రీజ్‌లో పాతుకుపోయి జట్టుకు అవసరమైన పరుగులను రాబట్టేవాడు. దాంతో నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. సూర్యకుమార్ సెకండ్ డౌన్‌లో ఇలా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఇప్పుడు మూడో స్థానంలో రావడంతో ఆచితూచి ఆడాల్సిన పరిస్థితిలోనూ తన పాత అలవాటునే కొనసాగించి బోల్తా పడ్డాడు.