Suresh Raina CSK: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. తమ చిరకాల బ్యాటర్ సురేశ్ రైనాకు భావోద్వేగ వీడ్కోలు పలికింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి.. 2016, 2017 మినహా మిగిలిన అన్ని సీజన్లలోనూ సీఎస్కేకు రైనా సేవలందించాడు. ఆ రెండు సీజన్లలో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లైయన్స్ ఫ్రాంచైజీకి నేతృత్వం వహించాడు. అయితే గతేడాది దుబాయ్లో జరిగిన ఐపీఎల్ సీజన్లో ఫ్రాంచైజీకి రైనాకు మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ కారణంగానే చిన్నా తలాగా భావించే రైనాను సీఎస్కే వదులుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రైనా పాల్గొన్నాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో పాటు కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయి.. బ్యాటింగ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. ఫలితంగా రైనాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ సాహసం చేయలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రైనాను భావోద్వేగంతో సాగనంపింది సీఎస్కే. ఈ మేరకు ఫ్రాంచైజీతో రైనాకు ఉన్న అనుబంధాన్ని ఓ వీడియో రూపంలో తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.