వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. పాకిస్థాన్, శ్రీలంక జట్ల మీద ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియా పరాజయం పాలైంది. దీంతో భారత ప్రదర్శనపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలో లంకతో మ్యాచ్ అనంతరం ఓ ఛానెల్‌తో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. భారత్ తుది జట్టు కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పదకొండు మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవంతోనే ఆసియా కప్‌లో లయ అందుకోలేకపోయారని పేర్కొన్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లను దక్షిణాఫ్రికా, ఆసీస్‌తో సిరీస్‌లకు ఆడించాలని సూచించాడు.
జట్టులో ప్రయోగాలకు స్వస్తి చెప్పాలని, పని ఒత్తిడి గురించి మాట్లాడటం ఆపాలని గావస్కర్ అన్నాడు. ''ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లలో ఎక్కువ మందిని జింబాబ్వే పర్యటనకు పంపించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఓ నలుగురైదుగురిని ఎంపిక చేశారు. అయితే జింబాబ్వేపై రాణించిన వారికి ఆసియా కప్ తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. అందుకే వారంతా కుదురుకోవడానికి సమయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇకనైనా టీ20 ప్రపంచకప్ జరిగేలోపు ఆడే సిరీస్‌ల్లో ప్రయోగాలు చేయొద్దు.. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి ఇస్తున్నామనే మాటలను ఆపేయాలి. భారత్ తరఫున మాత్రమే ఆడితే వర్క్‌లోడ్ అనేది సమస్య కాదు. ఇప్పుడు ఆసియా కప్ నుంచి ముందుగానే వైదొలిగితే అదనంగా మరో మూడు రోజులపాటు రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు విశ్రాంతి తీసుకొని ఆసీస్ సిరీస్ కోసం సన్నద్ధం కావాలి.'' అని సునీల్ గావస్కర్ సూచించాడు. స్వదేశంలోనే సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఆసీస్‌తో మూడు టీ20లు.. అలాగే దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 11 వరకు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లను భారత్ ఆడనుంది.