Sunil Gavaskar KL Rahul : శస్త్రచికిత్స చేయించుకొని జట్టులోకి వచ్చి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా ఆసియా కప్‌లోనూ ధాటిగా ఆడలేపోక ఇబ్బంది పడ్డాడు. తొలి మ్యాచ్‌లో పాక్‌పై మొదటి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇక హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఆరంభంలో పరుగులు చేసేందుకు చాలా బంతులను ఆడాల్సి వచ్చింది. కాస్త క్రీజ్‌లో కుదురుకున్నాడని భావించే లోపు ఔటయ్యాడు. దీంతో రాహుల్ ఆటతీరుపై విమర్శలు రావడం మొదలైంది. అయితే టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. హాంకాంగ్‌తో మ్యాచ్ అనంతరం ఓ ఛానెల్‌తో గావస్కర్ మాట్లాడాడు. ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న మరికొందరికి మేనేజ్‌మెంట్ మద్దతు ఇచ్చినట్లే రాహుల్‌కు అవకాశం ఇవ్వాలన్నాడు.
"హాంకాంగ్ మీద నెమ్మదిగా ఆడాడని చాలా మంది విమర్శిస్తున్నారు. అవి సరైంది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్. చాలా ఏళ్లపాటు టీమ్‌ఇండియా తరఫున మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇతర ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చారు కదా..? మరి కేఎల్ రాహుల్‌కు ఎందుకు ఇవ్వరు? అతడు భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్. టీ20 ఫార్మాట్‌లో రాహుల్ సామర్థ్యం ఏంటో మనమంతా చూశాం. అతడు గాయం నుంచి కోలుకుని వచ్చాడు. తన బ్యాటింగ్ రిథమ్‌ను అందుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే అవకాశాలు ఇవ్వాలని చెబుతున్నా" అని గావస్కర్ వివరించాడు. గతనెల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియాకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకుని వచ్చాడు.