Stokes Catch Drop in Ashes 2023 : యాషెస్లోమరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి క్యాచ్ ఔట్ విషయంపై అంపైర్ల నిర్ణయం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ విషయం వివాదాస్పదమైంది. ఆసిస్ బ్యాటర్ స్మిత్ఇచ్చిన క్యాచ్‌ను.. ఇంగ్లాండ్ సారధి బెన్ స్టోక్స్ ఎగిరి అందుకున్నాడు. కానీ రిప్లైలో స్మిత్ నాటౌట్ అని తేలింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
చివరి టెస్టు మ్యాచ్‌లో.. ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు.. మొయిన్ అలీ 65 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో స్ట్రయికింగ్‌లో ఉన్న ఆసిస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. మొదటి బంతిని ఎదుర్కొన్నాడు. అయితే ఆ బంతి.. స్మిత్ గ్లవ్స్‌ను తాకి గాల్లోకి ఎగిరింది. అక్కడే లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్బంతిని అనుసరిస్తూ.. అమాంతం గాల్లోకి ఎగిరి అద్భుతంగా బంతిని పట్టుకున్నాడు.
Stokes Catch Drop Controversy : అయితే క్యాచ్ పట్టుకున్న స్టోక్స్.. తనను తాను నియంత్రించుకోలేక క్షణాల్లోనే బంతిని జారవిడిచాడు. ఇక అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల.. స్టోక్స్ రివ్యూ కోరాడు. దీంతో ఆ క్యాచ్‌ను థర్డ్ అంపైర్.. రిప్లైలో నిశితంగా పరిశీలించి స్మిత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఇంగ్లాండ్ రివ్యూను కూడా కోల్పోయింది. కాగా అప్పుడు స్మిత్ వ్యక్తిగత స్కోర్ 39 పరుగులు. దానికి అదనంగా మరో 15 పరుగులు జోడించిన అతడు.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి.. ఆసిస్ జట్టును 334 పరుగులకు కట్టడి చేశారు. దీంతో ఆతిథ్య జట్టు 49 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
స్పందించిన ఐసీసీ..
ICC Catch Rules :అయితే ఈ క్యాచ్ ఔట్ విషయంపై ఇరుజట్ల మధ్య సందిగ్ధం నెలకొంది. కాగా దీనిపై స్పందించిన ఐసీసీ.. " రూల్స్ ప్రకారం స్టోక్స్ అందుకున్న క్యాచ్ స్పష్టంగా లేదు. ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ అందుకుంటే.. ఆఖరి వరకు నియంత్రణలో ఉండాలి. అలా అయితేనే ఆ క్యాచ్ సరైనదిగా పరిగణిస్తాం. ఈ క్యాచ్‌ను కూడా అనేక సార్లు.. రిప్లేలో పరిశీలించిన తర్వాతే అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు" అని వివరణ ఇచ్చింది.
బంతి మార్పుపై పాంటింగ్ విచారణకు డిమాండ్..
Ashes Test 2023 : రెండో ఇన్నింగ్స్ ఆట మధ్యలో ఇంగ్లాండ్ బంతిని మార్చడం పట్ల.. ఆసిస్ మాజీ కెప్టెన్ అసహనం వ్యక్తం చేశాడు. అప్పటివరకూ అద్భుతంగా ఆడిన తమ జట్టును.. కొత్త బంతితో ఇంగ్లాండ్ బోల్తా కొట్టించిందని పాంటింగ్ విమర్శించాడు. బంతిని మార్చాల్సిన పరిస్థితి వస్తే.. అదే తరహాలో ఉండే ఇంకో బంతిని చూడాలి, కానీ కొత్త బంతిని తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నాడు పాంటింగ్. ఈ వివాదంపై విచారణ జరపాల్సిందేనని పాంటింగ్ డిమాండ్ చేశాడు.