దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటేనే కరోనాపై విజయం సాధిస్తామని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. ప్రస్తుతం మన దేశాన్ని కొవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలను సురక్షితంగా ఉండమని చెబుతూనే, తోటి వారికి సహాయం చేయాలని జడేజా కోరాడు.
'కలిసికట్టుగా ఉండండి.. కరోనాతో పోరాడండి' - jadeja latest news
కరోనాను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని జడేజా అన్నాడు. పక్క వాళ్లకు సాయం చేసే విషయమై చొరవ తీసుకొండని ప్రజలకు సూచించాడు. ఇటీవల ఐపీఎల్లో పాల్గొన్న జడ్డూ.. సీజన్ వాయిదా పడటం వల్ల ఇంట్లోనే ఉన్నాడు.
'దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. దాంతో మీరూ, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాతో పోరాడాలి. కాబట్టి దయచేసి మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మీ చుట్టు పక్కలున్న వారికి కూడా సహాయం చేయండి. కొన్నిసార్లు ఏదైనా సహాయం అడగాలంటే కొంతమంది మొహామాటం పడతారు. మీరే చొరవ తీసుకొని ఏదైనా కావాలా అని అడిగి తెలుసుకోండి. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ మహమ్మారిపై విజయం సాధిస్తాం' అని జడేజా చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడం వల్ల వేలమంది నుంచి మంచి స్పందన వచ్చింది.
మరోవైపు కరోనా కేసుల కారణంగా ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా వేశారు. పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటం వల్ల బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఈ సంయుక్త నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో చెన్నైజట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. టోర్నీని వాయిదా వేయడం వల్ల ఆటగాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు.