శ్రీలంక- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆదివారం అనూహ్య ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న వెస్టిండీస్ అరంగేట్ర ఆటగాడు జెరెమీ సోలోజానో(West indies player injury) తలకు బంతి తాకగా.. మైదానంలో కుప్పకూలాడు. మ్యాచ్ 24వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. దాంతో హుటాహుటిన అతడ్ని వైద్య పరీక్షల కోసం తరలించారు.
రోస్టన్ చేజ్ వేసిన బంతిని శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే పుల్ షాట్ బాదాడు. ఆ బంతి సరాసరి ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ సోలోజానో తలకు తగిలింది. తలకు హెల్మెట్(ball hits batsman helmet) ఉన్నప్పటికీ.. బంతి వేగంగా దూసుకు రావడం వల్ల అది బలంగా తాకింది. దాంతో అతడు అక్కడే కుప్పకూలాడు. ఆ వెంటనే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించి.. స్ట్రెచర్‌పై అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం ముందు వరకు 27 ఓవర్లు పూర్తి కాగా.. 61 పరుగులను సాధించింది.