Special Security To Babar Azam :2023 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది పాకిస్థాన్ క్రికెట్ టీమ్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చాలాకాలం తర్వాత ఈ స్టేడియంలో ఆడనుంది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు బంగాల్ పోలీసులు. ఇందుకోసం స్పెషల్ సెక్యురిటీ టీమ్‌ను నియమించారు. పాక్ క్రికెట్ జట్టు శనివారం కోలకతాకు చేరుకుంటుంది.
"పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ శనివారం కోల్‌కతాకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే ఆయన స్పెషల్ సెక్యురిటీ టీమ్ పర్యవేక్షణలో బస చేయనున్న సిటీ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గది బయట కూడా మా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు."
-కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారులు
మైదానంలో కూడా..
బాబర్ బస చేసే హోటల్ లోపల, బయటనే కాకుండా ఆయన ఆడే ఈడెన్ మైదానంలోనూ పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇందుకోసం అంతర్గత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆజమ్ ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా బౌండరీల వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎందుకంటే స్టేడియంకు వచ్చే అభిమానులు, ప్రేక్షకుల నుంచి బాబర్ ఎటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోకుండా ఉండేందుకే కోల్‌కతా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ పోలీసు ఉన్నతాధికారి ఈటీవీ భారత్‌తో చెప్పారు.