టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సూపర్ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై(WI vs SA t20 match) దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మర్‌క్రమ్ (51; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డస్సెన్ (43; 51 బంతుల్లో 3 ఫోర్లు, ) రాణించడం వల్ల విండీస్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ బవుమా (2) తర్వగా పెవిలియన్ చేరినా తర్వాత వచ్చిన డస్సెన్.. ఓపెనర్ హెన్‌డ్రిక్స్(39)తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. హొస్సెన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో హెన్‌డ్రిక్స్ హెట్‌మయర్‌కి చిక్కాడు. తర్వాత మర్‌క్రమ్, డస్సెన్ నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. విండీస్ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్ నుంచి గేర్ మార్చిన ఎవిన్ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ సిమ్మన్స్ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్.. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్ వాల్ష్ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్ 26 పరుగులు చేశాడు. డ్వేన్ బ్రావో (8), అకీల్ హోసేన్ (0) నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్ ప్రిటోరియస్ మూడు, కేశవ్ మహరాజ్ రెండు, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే తలో వికెట్ తీశారు.