Shubman Gill Gujarat Titans :యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కొత్త పగ్గాలను అప్పజెప్పింది. హార్దిక్ పాండ్యా తర్వాత ఆ జట్టు సారథిగా గిల్‌ను నియమించింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత గిల్ తనకు అందిన ఈ రోల్ గురించి ఓ స్పెషల్ వీడియోలో మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ.. తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అందులో గిల్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. జట్టు కోసం కష్టపడి పనిచేయడం ముఖ్యమని, అందులో లాయల్టీ (విధేయత) కూడా ఒకటని గిల్ అన్నాడు. గిల్ ఆ పదాన్ని ఉపయోగించిన వెంటనే నెటిజన్లు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హార్దిక్‌ను ట్రోల్ చేయడం మొదలెట్టారు.
"ఐపీఎల్‌లో ఆడటం అనేది ప్రతి ప్లేయర్ కల. నాకు 7-8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఐపీఎల్ సీజన్ మొదలైంది. ఇప్పుడు ఆ లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది నాకు పెద్ద విషయం. కెప్టెన్సీకి క్రమశిక్షణ, కృషి, విధేయత చాలా అవసరం. నేను చాలా మంది పెద్ద కెప్టెన్ల జట్లలో ఆడాను. వారి నుంచి నేను నేర్చుకున్నది ఈ ఐపీఎల్‌లో నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను" అని గిల్ చెప్పుకొచ్చాడు. అయితే గిల్ చేసిన వ్యాఖ్యలు హార్దిక్‌కు ఉద్దేశించినవి కానప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.
మరోవైపు గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల చాలామంది ప్లేయర్లు నెట్టింట తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మహమ్మద్ షమీ కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండగా గిల్‌ను ఎలా కెప్టెన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.